యువతకు స్ఫూర్తి నేతాజీ .. జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతి

యువతకు స్ఫూర్తి నేతాజీ .. జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతి

1887 జనవరి 23వ తేదీన కటక్​లో  ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం విడిచిపెట్టి దేశ స్వాతంత్య్రం కోసం కదనరంగంలో దూకిన ధైర్యశాలి. ఒక్కమాటలో చెప్పాలంటే,  బ్రిటిష్ వారిని మనదేశం నుంచి  తరిమికొట్టడానికి సైనిక చర్య ద్వారానే సాధ్యం అని నమ్మి ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు.  ఎందరో యువకులను స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేటట్టు చేశాడు. ‘మీ రక్తాన్ని ఇవ్వండి - నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని ఉర్రూతలూగించిన నేతాజీ మన అందరికి నేటికీ ఆదర్శం అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా నేటి యువత చాలా సమయాన్ని వృథాగా గడుపుతోంది. 

సెల్​ఫోన్లు,  వీడియో గేమ్స్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్​ వంటి సోషల్ మీడియాలో అనవసరమైన చిట్ చాట్​లతో  కాలం గడుపుతున్నారు. ఇది ఏమాత్రం వారికిగాని, దేశానికిగాని ఉపయోగకరం కాదు. దేశం కోసం నేను ఏమి చేయాలో.. ఇకనైనా ఆలోచన చేయాలి.  చదువుల్లో రాణించాలి. నూతన ఆలోచనలు, ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. ‘నోబెల్ బహుమతి’ సాధనలో నిమగ్నమవ్వాలి.  ఒలింపిక్ క్రీడలలో పతకాలు సాధించేందుకు ఆరాటపడాలి.  నేతాజీ నూరిపోసిన  దేశభక్తి ని  అందిపుచ్చుకుని సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలి. విచ్ఛిన్నకర మైన శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలి. భారత దేశం విశిష్ట లక్షణం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ కాపాడాలి.  మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి.  

మూఢనమ్మకాలపై  పోరుబాట పట్టాలి. భారత రాజ్యాంగ లక్ష్యాలైన లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద ఆశయాలు దిశగా అడుగులు వేయాలి. సోషలిస్టు భావాలతో ముందుకు సాగాలి.  శాస్త్రీయ దృక్పథంతో కదలాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మన కర్తవ్యం అని భావించాలి.‌‌‌‌ ఆపదకాలంలో దేశానికి ధైర్యం ఇచ్చిన నేతాజీలాగ, నేడు దేశాన్ని పీడిస్తున్న అవినీతి, ఆక్రమణలు, పేదరికం, స్వార్థం, వివిధ వివక్షతలపై నేటి యువత పోరుబాట పట్టాలి. 

నేతాజీ జన్మదినాన్ని ‘పరాక్రమ దివస్’గా జరుపుకుంటున్న నేటి సమయంలో, భవిష్యత్తులో ‘ వికసిత్ భారత్’ సాధనలో నేటి యువత అన్ని రకాల సామర్థ్యలతో, నైపుణ్యాలతో భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుటలో ప్రధాన భూమిక పోషించాలని ఆశిద్దాం. ‘అన్యాయం, తప్పుతో రాజీపడటమే అత్యంత ఘోరమైన నేరమని మర్చిపోవద్దు’ అని నేతాజీ తెలిపిన మాటలు  నిత్య జీవితంలో మనం అందరం ఆచరించడమే   నేతాజీకి మనం ఇచ్చే ఘన నివాళి.

-ఐ. ప్రసాదరావు, విశ్లేషకులు-