సినిమా అయినా, షో అయినా అందులో నచ్చిన మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసి, వాటిని షేర్ చేయడం చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ, చేయడానికి వీల్లేదు ఇప్పటివరకు. అందుకే నెట్ ఫ్లిక్స్ ‘‘మూమెంట్స్’’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు నెట్ ఫ్లిక్స్‌లోని సినిమాలు, షోలు చూసేటప్పుడు తమకు ఇష్టమైన సీన్స్‌ను క్యాప్చర్ చేయొచ్చు. వాటిని షేర్ కూడా చేయొచ్చు. అనధికారిక కంటెంట్ షేరింగ్‌ను ఆపడానికి నెట్ ఫ్లిక్స్ గతంలో ఈ ఫీచర్‌ను బ్లాక్ చేసింది. మళ్లీ ఈ ఫీచర్‌ను యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.
దాన్ని వాడాలంటే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెట్ ఫ్లిక్స్‌లో మీరు ఏదైనా సినిమా లేదా షో చూస్తున్నప్పుడు, అందులోని సీన్‌ను మూమెంట్స్‌లో క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే, స్క్రీన్ పై ట్యాప్ చేయాలి. ప్లేయర్ ఇంటర్ ఫేస్‌లో ఆ సీన్‌ను సేవ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. ఒక యూజర్ సేవ్ చేయడానికి ఒక సన్నివేశాన్ని ఎంచుకున్న తర్వాత, నెట్‌ఫ్లిక్స్ యాప్ ఆటోమేటిక్‌గా కస్టమ్ స్క్రీన్ షాట్‌ను క్రియేట్ చేస్తుంది.
ఇందులో షో పేరు, ఎపిసోడ్, సన్నివేశం, టైమ్ వంటి వివరాలు ఉంటాయి. నెట్ ఫ్లిక్స్‌లోని కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాము సేవ్ చేసుకున్న క్షణాలను చూడొచ్చు. అంతేకాకుండా, యూజర్లు ఈ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయొచ్చు. అభిమానులు తమకు ఇష్టమైన సన్నివేశాలను, తమ అభిప్రాయాలను క్రియేటివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.