డచ్ ధమాకా.. సౌతాఫ్రికా సఫా

డచ్ ధమాకా.. సౌతాఫ్రికా సఫా
  • సఫారీలను ఓడించి నెదర్లాండ్స్‌‌ సంచలనం
  • 38  రన్స్‌‌ తేడాతో సూపర్​ విక్టరీ  రాణించిన ఎడ్వర్డ్స్‌‌, బౌలర్లు


వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో మరో పెను సంచలనం. డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ను  అఫ్గానిస్తాన్‌‌‌‌ ఓడించిన షాక్‌‌‌‌ నుంచి తేరుకోకముందే  టోర్నీలో మరో అనూహ్య ఫలితం వచ్చింది. తమ తొలి పోరులోనే ఆస్ట్రేలియాను ఓడించి రెండో మ్యాచ్‌‌‌‌లో  వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో హయ్యెస్ట్‌‌‌‌ స్కోరు, ఫాస్టెస్ట్‌‌‌‌ సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టిన సౌతాఫ్రికాకు క్వాలిఫయర్‌‌‌‌ నెదర్లాండ్స్‌‌‌‌ చెక్‌‌‌‌ పెట్టింది. ఓ దశలో 112/6తో నిలిచిన డచ్​ జట్టుకు కెప్టెన్‌‌‌‌ స్కాట్‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌ మంచి స్కోరు అందిస్తే..  బౌలర్లంతా సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేశారు. దాంతో, గతేడాది టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లోనూ సౌతాఫ్రికాను ఓడించిన డచ్‌‌‌‌ టీమ్‌‌‌‌ వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లోనూ అదే రిజల్ట్‌‌‌‌ను రిపీట్‌‌‌‌ చేసి ఔరా అనిపించింది.

ధర్మశాల: బలమైన సౌతాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్‌‌‌‌ టీమ్​ తమ వన్డే హిస్టరీలో అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది.  మంగళవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 38  రన్స్‌‌‌‌ తేడాతో  గెలిచి టోర్నీలో ఖాతా తెరిచింది. వాన కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ పోరులో తొలుత నెదర్లాండ్స్‌‌‌‌  245/8 స్కోరు చేసింది. కెప్టెన్ స్కాట్​ ఎడ్వర్డ్స్‌‌‌‌ (69 బాల్స్​లో 10 ఫోర్లు, 1 సిక్స్​తో 78 నాటౌట్) కు తోడు చివర్లో వాండర్‌‌‌‌ మెర్వే (29), ఆర్యన్‌‌‌‌ దత్‌‌‌‌ (23 నాటౌట్‌‌‌‌) మెరుపులు మెరిపించారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి, జాన్సెన్‌‌‌‌, రబాడ తలో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌లో సఫారీ టీమ్‌‌‌‌ 42.5 ఓవర్లలో 207 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌ (43), కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ (40) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. డచ్‌‌‌‌ బౌలర్లలో వాన్‌‌‌‌ బీక్‌‌‌‌ మూడు, మీకెరెన్‌‌‌‌, మెర్వే, డి లీడె రెండేసి వికెట్లు పడగొట్టారు. ఎడ్వర్డ్స్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు దక్కింది.

ఎడ్వర్డ్స్‌‌‌‌ అదుర్స్‌‌‌‌

వాన వల్ల ఆలస్యంగా మొదలైన పోరులో టాస్‌‌‌‌ నెగ్గిన సఫారీ టీమ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ఎంచుకోగా.. వెంటవెంటనే ఆరు వికెట్లు పడగొట్టిన బౌలర్లు  డచ్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్‌‌‌‌ విక్రమ్‌‌‌‌జీత్‌‌‌‌ (2)ను  రబాడ తన తొలి బాల్‌‌‌‌కే ఔట్‌‌‌‌ చేసి ఫస్ట్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ ఇవ్వగా.. ఒడౌడ్‌‌‌‌ (18)ను జాన్సెన్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌ చేర్చాడు. 11వ ఓవర్లో  డిలీడె (2)ను రబాడ  ఎల్బీగా ఔట్‌‌‌‌ చేయగా.. కోయెట్జ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో  అకెర్‌‌‌‌మన్‌‌‌‌ (12) బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. 

ఈ దశలో తెలుగు క్రికెటర్‌‌‌‌ తేజ (20), సైబ్రాండ్‌‌‌‌  (19) ఐదో వికెట్‌‌‌‌కు 32 రన్స్‌‌‌‌ జోడించాడు. కానీ, ఈ ఇద్దరూ ఆరు ఓవర్ల తేడాతో పెవిలియన్‌‌‌‌ చేరడంతో 112/6తో నిలిచిన డచ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 150లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ టైమ్‌‌‌‌లో లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ బ్యాటర్ల సాయంతో కెప్టెన్‌‌‌‌ స్కాట్‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌  సఫారీ బౌలర్లకు ఎదురు నిలిచాడు. మెర్వే సపోర్ట్‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. 

తన ఇన్నింగ్స్‌‌‌‌లో పది ఫోర్లు బాదిన ఎడ్వర్డ్స్‌‌‌‌.. రబాడ బౌలింగ్‌‌‌‌లో అద్భుత పుల్‌‌‌‌ షాట్‌‌‌‌తో సిక్స్‌‌‌‌ కొట్టడం ఇన్నింగ్స్‌‌‌‌కే హైలైట్‌‌‌‌గా నిలిచింది. ఎడ్వర్డ్స్​, మెర్వే ఎనిమిదో వికెట్‌‌‌‌ 37 బాల్స్‌‌‌‌లోనే 64 రన్స్‌‌‌‌ జోడించారు. ఇక పదో నంబర్‌‌‌‌లో వచ్చిన ఆర్యన్‌‌‌‌ ఫోర్​, 3 సిక్సర్లతో రెచ్చిపోయాడు.  చివరి మూడు ఓవర్లలో డచ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 41 రన్స్‌‌‌‌ రాబట్టి మంచి స్కోరు చేసింది.

సఫారీ బ్యాటర్లు విలవిల

ఛేజింగ్‌‌‌‌లో డచ్‌‌‌‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌‌‌‌ దెబ్బకు విలవిలలాడిన సౌతాఫ్రికా ఏ దశలోనూ విజయానికి చేరువ కాలేకపోయింది. ఓపెనర్లు బవూమ (16), డికాక్‌‌‌‌ (20)  తొలి వికెట్‌‌‌‌కు 36 రన్స్‌‌‌‌ జోడించి మంచి ఆరంభమే ఇచ్చినా.. 8 ఓవర్లో అకెర్‌‌‌‌మన్‌‌‌‌ వేసిన ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌కు డికాక్‌‌‌‌ కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో సఫారీల పతనం మొదలైంది. రెండు ఓవర్ల తర్వాత బవూమను మెర్వే బౌల్డ్‌‌‌‌ చేయగా..  మీకెరెన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో  మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (1) క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. 

తర్వాతి ఓవర్లోనే డసెన్‌‌‌‌ (4)ను మెర్వె వెనక్కు పంపడంతో సౌతాఫ్రికా 44/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో  మిల్లర్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. అతనికి క్లాసెన్‌‌‌‌ (28) కాసేపు సపోర్ట్‌‌‌‌ ఇచ్చాడు. నాలుగు ఫోర్లతో మెప్పించిన క్లాసెన్‌‌‌‌ 19వ ఓవర్లో అనవసర షాట్‌‌‌‌ ఆడి వికెట్‌‌‌‌ పారేసుకున్నాడు.  స్కోరు వంద దాటిన తర్వాత జాన్సెన్‌‌‌‌ (9)ను సైతం మీకెరెన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేశాడు. 

ఈటైమ్‌‌‌‌లో మిల్లర్‌‌‌‌,  కోయెట్జ్‌‌‌‌ (22) వరుస బౌండ్రీలతో ఎదురుదాడికి దిగడంతో సఫారీ టీమ్‌‌‌‌ రేసులోకి వచ్చేలా కనిపించింది. కానీ, డచ్‌‌‌‌ బౌలర్లు ఆ చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. మిల్లర్‌‌‌‌ను వాన్‌‌‌‌ బీక్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేయగా.. మూడు బాల్స్‌‌‌‌ తేడాలో కొయెట్జ్‌‌‌‌ను డి లీడె వెనక్కుపంపడంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైంది. చివర్లో కేశవ్ పోరాటంతో స్కోరు 200 దాటింది.

ఐసీసీ అసోసియేట్‌‌‌‌ టీమ్‌‌‌‌  చేతిలో వన్డే మ్యాచ్‌‌‌‌లో ఓడటం సౌతాఫ్రికాకు ఇదే తొలిసారి. 

వరల్డ్‌‌‌‌కప్స్‌‌‌‌లో నెదర్లాండ్స్‌‌‌‌కు ఇది మూడో విజయం.  2003లో నమీబియాను, 2007లో స్కాట్లాండ్‌‌‌‌ను ఓడించింది.

సంక్షిప్త స్కోర్లు


నెదర్లాండ్స్‌‌: 43 ఓవర్లలో 245/8 (ఎడ్వర్డ్స్‌‌ 78 నాటౌట్‌‌, జాన్సెన్‌‌ 2/27). సౌతాఫ్రికా: 42.5 ఓవర్లలో 207 ఆలౌట్‌‌ (మిల్లర్‌‌ 43, కేశవ్‌‌ 40, వాన్‌‌ బీక్‌‌ 3/60).