- హైడ్రాకు సపోర్ట్ చేద్దాం.. హైదరాబాద్‌ను కాపాడుకుందాం’ అంటూ నెటిజన్ల పోస్టులు
- చెన్నై, బెంగళూర్ వరదల ఫొటోలు, వీడియోలు షేరింగ్
- అలాంటి పరిస్థితి మనకు రావొద్దంటే హైడ్రాకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌లో వరదలు రావొద్దంటే హైడ్రాకు మద్దతు ఇవ్వాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు సపోర్ట్ చేద్దాం.. హైదరాబాద్‌ను కాపాడుకుందాం” అని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘సపోర్ట్ హైడ్రా’ హ్యాష్ ట్యాగ్‌తో చేస్తున్న ఈ పోస్టులన్నీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. మూడ్రోజుల నుంచి కురుస్తున్న వానలకు చెన్నై, బెంగళూర్ జలమయమయ్యాయి. ఆ సిటీల్లో నీట మునిగిన కాలనీలు, రోడ్లపై తిరుగుతున్న బోట్లు, ఫ్లైఓవర్ల మీద పార్కింగ్ చేసిన కార్ల ఫొటోలను నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్చేస్తున్నారు.
రానున్న రోజుల్లో హైదరాబాద్ కు ఇలాంటి పరిస్థితి రావొద్దనే ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిందని , దానికి అందరం సపోర్ట్ చేద్దామంటూ పోస్టులు పెడుతున్నారు. హైడ్రాకు ముందు, ఆ తర్వాత అంటూ పలు ఫొటోలను షేర్ చేస్తున్నారు. భవిష్యత్ తరాలు వరదల బారిన పడకుండా ఉండాలంటే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. హైడ్రాను కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, చెన్నై, బెంగళూర్ జలమయమైన నేపథ్యంలో ఇన్ని రోజులు హైడ్రాను విమర్శించినోళ్లు సైతం.. సోషల్‌మీడియా వేదికగా దానికి మద్దతు పలుకుతున్నారు.
సిటీకి తప్పని వరద కష్టాలు..
ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ దేశంలోనే టాప్ మెట్రో సిటీలుగా గుర్తింపు పొందాయి. కానీ ఇవి తరచూ వరదల బారిన పడుతున్నాయి. వరదలు వచ్చినప్పుడల్లా జనం అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నది. ఈ నగరాల్లో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, వాగులు ఆక్రమణలకు గురికావడమే వరదలకు ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 2021లో హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా వందలాది కాలనీలు నీట మునిగి, వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది.
సుమారు వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని, నాలాలపై కబ్జాలను తొలగిస్తామని అప్పటి సీఎం కేసీఆర్ప్రకటించినా.. ఆ తర్వాత పట్టించుకోలేదు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉన్నోళ్లను తరలించి, నది ప్రక్షాళన చేస్తామని ప్రకటించి.. అది కూడా చేయలేదు. ఫలితంగా చిన్నపాటి వరదకే నగరంలోని వందలాది కాలనీలు నీట మునుగుతున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచి, గంటల తరబడి ట్రాఫిక్స్తంభించి జనం నరకం అనుభవిస్తున్నారు.