మా బౌలర్ తిరిగొచ్చాడు.. భారత్‌కు చుక్కలే అంటున్న పాక్ ఫ్యాన్స్

మా బౌలర్ తిరిగొచ్చాడు.. భారత్‌కు చుక్కలే అంటున్న పాక్ ఫ్యాన్స్

పాక్ జట్టు నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ అమీర్ మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నాడు. అంతర్జాతీయ లీగ్ ల్లో అదరగొడుతున్న ఈ మాజీ బౌలర్.. పాక్ జట్టుకు ఆడాలని తమ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈ 31 ఏళ్ళ పేసర్ పాక్ జట్టులో చోటు సంపాదించారు. ఏప్రిల్ 18న రావల్పిండిలో న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టు ఎంపిక చేసిన 17 మంది ప్రాబబుల్స్ లో అమీర్ చోటు దక్కించుకున్నాడు. 

అమీర్ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో  పాక్ అభిమానులు సంతోషంలో తేలిపోతున్నారు. జూన్ 9 న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో విజయం పాక్ దే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత్ కు పీడ కలను మిగిల్చిన అమీర్ వచ్చేశాడని కొందరంటుంటే.. అమీర్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ ఖాయమని మరికొందరంటున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పై అమీర్ విశ్వరూపమే చూపించాడు. పవర్ ప్లే లోనే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ వికెట్లను తీసి మ్యాచ్ ను ఏకపక్షం చేశాడు. 

అమీర్ బౌలింగ్ తో భారత్ కోలుకోలేకపోయింది. పైగా ఈ పాక్ పేసర్ చేతిలో రోహిత్ శర్మకు చెత్త రికార్డ్ ఉంది. దీంతో ఈ సారి పాక్ విజయం తథ్యం అంటున్నారు అభిమానులు. అమీర్ తో పాటు ఆల్ రౌండర్ ఇమాద్ వాసీం వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.  31 ఏళ్ల అమీర్ పీసీబీతో చర్చలు జరిపిన తర్వాత తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై యు-టర్న్ తీసుకున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఆమీర్ నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 2019లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.