PAK vs BAN 2024: సొంతగడ్డపై బంగ్లా చేతిలో క్లీన్ స్వీప్.. పాకిస్థాన్ జట్టుపై ఘోరంగా ట్రోలింగ్

PAK vs BAN 2024: సొంతగడ్డపై బంగ్లా చేతిలో క్లీన్ స్వీప్.. పాకిస్థాన్ జట్టుపై ఘోరంగా ట్రోలింగ్

రావల్పిండిలో బంగ్లాదేశ్ పై తొలి టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో అంచనాలకు తగ్గట్టు భారీ స్కోర్.. గెలుపు కోసం తొలి ఇన్నింగ్స్ డిక్లేర్..ఈ దశలో పాక్ విజయంపై ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. కట్ చేస్తే బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి. ఈ ఓటమితో పాక్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ నుంచి మాజీల వరకు మండిపడ్డారు. 

రావల్పిండి వేదికగా రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో  274 పరుగులకే ఆలౌట్.. అయితే బౌలింగ్ లో విజృంభించడంతో బంగ్లా 26 పరుగులకే ఆరు వికెట్లు.. ఇంకేముంది సెకండ్ టెస్టులో పాక్ భారీ విజయం అనుకున్నారు. కట్ చేస్తే 6 వికెట్ల తేడాతో ఘోర పరాభవం. ఈ రెండు టెస్టుల్లో కూడా చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ ను పాక్ చేజార్చుకున్నారు. దీంతో ఈ పరాజయాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలోకి ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. 

తాజాగా ముగిసిన ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 274 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులకే పరిమితమైంది. 22 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా లిటన్ దాస్ (138) అద్భుత సెంచరీకి తోడు మెహదీ హసన్ మిరాజ్ (78) హాఫ్ సెంచరీతో ఆ జట్టును గట్టెక్కించారు. 12 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన పాక్ కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. 185 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 4 వికెట్లను కోల్పోయి ఛేజ్ చేసింది. 

సొంత గడ్డపై ఏ జట్టు అయినా బలంగానే ఉంటుంది. టెస్టుల్లో అయితే విజయం దాదాపుగా ఖాయం. కానీ పాకిస్థాన్ పరిస్థితి దీనికి భిన్నం. సొంతగడ్డపై ఓడిపోవడమే కాకుండా.. పసికూన జట్లపై భారీ ఓటములు మూటగట్టుకుంటుంది. ఈ పరాజయంతో పాక్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకుంది.