Vinesh Phogat: వినేశ్‌ ఫోగాట్‌పై సెటైర్లు.. వివాదంలో హేమ మాలిని

Vinesh Phogat: వినేశ్‌ ఫోగాట్‌పై సెటైర్లు.. వివాదంలో హేమ మాలిని

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫోగాట్‌ 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో పోటీ పడగా.. ఆమె అంతకంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేశారు. ఈ వార్త యావత్‌ భారత అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫైనల్లో రాణించి దేశానికి గోల్డ్ మెడల్ తెస్తారనుకుంటే, ఇలా జరిగిందేంటని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అయితే బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి హేమ మాలిని మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఒలింపిక్ క్రీడాకారిణిపై సెటైర్లు వేసి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. 

వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత అంశంపై మాట్లాడిన హేమ మాలిని.. బరువును అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మాకు తెలుసు. వినేశ్‌ ఫోగాట్‌ త్వరగా ఆ 100 గ్రాములు కోల్పోతుందని నేను ఆశిస్తున్నాను అని ఎంపీ పార్లమెంట్ వెలుపల వ్యాఖ్యానించారు. 

"100 గ్రాముల కారణంగా ఫోగాట్ అనర్హతకి గురికావడం ఆశ్చర్యంగా ఉంది. ఇది మన బరువును అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో చూపుతోంది. కళాకారులు, మహిళలు, అందరికీ 100 గ్రాములు కూడా చాలా ముఖ్యమైనది. ఆమె 100 గ్రాములు త్వరగా కోల్పోతుందని నేను ఆశిస్తున్నాను.. ఒలింపిక్ పతకాన్ని అయితే మనం పొందలేము.." అని మాట్లాడింది.

నెటిజెన్ల ఆగ్రహం

ఎంపీ అయ్యుండి కష్టకాలంలో భారత క్రీడాకారిణిలో ధైర్యాన్ని నూరిపోసేలా వ్యాఖ్యానించాలి కానీ, ఇలా మాట్లాడటం సిగ్గుచేటని నెటిజన్స్ హేమ మాలినిపై కామెంట్లు చేస్తున్నారు. 

"అనర్హతపై ఆమె నవ్వుతూ సిగ్గు లేకుండా మాట్లాడటం చూడండి. ఈ రాబందులను అధికారం నుండి తరిమివేయాలి" అని మరొక నెటిజెన్ కామెంట్ చేశారు.