ఒకవైపు క్రికెట్.. మరోవైపు జాబ్: క్రికెటర్ సోదరి ప్రకటనతో ఒరాకిల్‌‌పై విమర్శలు

ఒకవైపు క్రికెట్.. మరోవైపు జాబ్: క్రికెటర్ సోదరి ప్రకటనతో ఒరాకిల్‌‌పై విమర్శలు

టీ20 ప్రపంచక‌ప్‌ ద్వారా భార‌త సంత‌తి అమెరికా క్రికెట‌ర్‌ సౌర‌భ్ నేత్రవాల్కర్ ఓవ‌ర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లిన నేత్రవాల్కర్.. అక్కడే జాబ్ చేస్తూ అగ్రరాజ్యం తరుపున ప్రపంచ కప్‌లో బరిలోకి దిగాడు. తొలిసారి ఐసీసీ టోర్నీ ఆడుతున్నా.. తన బౌలింగ్ నైపుణ్యంతో అగ్రశ్రేణి బ్యాటలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 

పాకిస్థాన్‌ను సూప‌ర్ ఓవ‌ర్‌లో దెబ్బకొట్టిన ఈ ముంబై మాజీ బౌలర్.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రోహిత్‌, కోహ్లీల‌ను ఔట్ చేయడమే కాకుండా కట్టుదిట్టంగా బంతులేశాడు. అలా అని ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ క్రికెట్‌కే  పరిమితమయ్యారా..! అంటే కాదు. ఇప్పటికీ ఓవైపు క్రికెట్ ఆడుతూనే.. మరోవైపు ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని అతని సోదరి బయట ప్రపంచానికి తెలియజేసింది. 

నేత్రవాల్కర్ ఓవైపు వరల్డ్ కప్ టోర్నీ ఆడుతూనే.. మరోవైపు ఒరాకిల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు అతని సోదరి వెల్లడించింది. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన ఈ భారత సంతతి క్రికెటర్.., టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్‌తో కలిసి పనిచేస్తున్నారు. లింక్డ్‌ఇన్‌లో అతని ప్రొఫైల్ ప్రకారం, అతను టెక్నికల్ స్టాఫ్‌లో ప్రధాన సభ్యుడు. 2016 నుండి ఎనిమిదేళ్లుగా ఒరాకిల్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పటికి అతను మ్యాచ్ అనంతరం హోటల్ నుండి ఆఫీసు పని చేస్తున్నారట.

" అతను(నేత్రవాల్కర్) క్రికెట్ ఆడనప్పుడు జట్టు విజయం కోసం ఎంతలా తాపత్రయపడతాడో.. ఉద్యోగంలోనూ 100 శాతం ఇవ్వాలని చూస్తాడు.ల్యాప్‌టాప్‌ ఎప్పుడూ తన వెంటే ఉంటుంది. ఎక్కడికెళ్లినా దానిని వెంటపెట్టుకెళ్లాల్సిందే. ఇండియాకు వచ్చినప్పుడు దానిని(ల్యాప్‌టాప్) తెస్తాడు. పని చేస్తునే ఉంటాడు. అందుకే హోటల్‌లో మ్యాచ్ అయ్యాక తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. పని పట్ల అంత డెడికేట్‌గా ఉంటాడు.." అని అతని సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఒరాకిల్‌‌పై విమర్శలు

నేత్రవల్కర్ సోదరి ప్రకటనతో నెటిజన్లు ఒరాకిల్‌‌పై విమర్శలు వర్షం గుప్పించారు. 'టాక్సిక్ వర్క్ కల్చర్' అని దుయ్యబట్టారు. దేశానికి ఆడుతున్న ఒక క్రికెటర్‌కు కనీస మద్దతు ఇవ్వకపోగా.. అతనికి సెలవు ఇవ్వకపోవడం దురదృష్టకర్మాణి వాపోయారు. అయితే, మరికొందరు ఆఫీసు పని, క్రికెట్‌ను బ్యాలెన్స్ చేయడం పట్ల అతని అంకితభావాన్ని, నిబద్ధతను కొనియాడారు. 

సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓ వికెట్ తీశాడు. తద్వారా అమెరికాకు అద్భుత విజయాన్ని సాధించిపెట్టాడు. 1991 అక్టోబ‌ర్ 16న ముంబైలో జ‌న్మించిన నేత్రవాల్కర్ టీమిండియా త‌ర‌ఫున 2010లో అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు సెలక్ట్ అయ్యాడు.