ఎంత తొండాట: పేరుకే పాకిస్తాన్ యువ జట్టు.. అందరూ బాబాయిలే!

ఎంత తొండాట: పేరుకే పాకిస్తాన్ యువ జట్టు.. అందరూ బాబాయిలే!

ప్రతిష్టాత్మక ఎమర్జింగ్ ఆసియా కప్ 2023ను పాకిస్తాన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొలంబో వేదికగా ఆదివారం దాయాది జట్ల మధ్య జరిగిన తుది పోరులో పాక్.. 128 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 352 పరుగుల భారీ స్కోర్ చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 224 పరుగులకే కుప్పకూలింది. అయితే పాకిస్థాన్ జ‌ట్టు సాధించిన ఈ విజయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పాకిస్తాన్ ఏ జట్టు అని చెప్పి.. వయసు మళ్లిన ఆటగాళ్లను బరిలోకి దించిందని ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీపై నెటిజన్లు మండిపడుతున్నారు. లెజెండ్స్ లీగ్‌లో ఆడే వయసున్న ఆటగాళ్లను.. పిల్లలతో కలిపి బరిలోకి దించిందని ఎద్దేవా చేస్తున్నారు. తొండాట ఆడటంతో పాకిస్తాన్ తన వక్రబుద్ధి ఎన్నటికీ మార్చుకోదని కామెంట్లు చేస్తున్నారు. నెటిజనుల విమర్శల్లో వాస్తవం లేకపోలేదు.

భారత జట్టునిండా యువకులే..

యష్ ధుల్ సారథ్యంలోని భారత ఏ జట్టులో అందరూ యువకులే. భారత యువ కెప్టెన్ యష్ ధుల్ వయసు ఇరవై ఏళ్లు కాగా, మిగిలిన ఆటగాళ్లలో గరిష్ట వయసు 22 ఏళ్లు. బరిలోకి దిగిన 11 మంది క్రికెటర్లలో నలుగురి వయసు ఇరవై రెండేళ్లు. మిగిలిన వారు వారికంటే చిన్నవారు. 

భారత ఏ జట్టు ఆటగాళ్ల వయసు: సాయి సుదర్శన్ 21, అభిషేక్ శర్మ 22, నికిన్ జోస్ 22, యష్ ధుల్ 20, ధృవ్ జురెల్ 22, నిశాంత్ సంధు 19, రియాన్ పరాగ్ 21, హర్షిత్ రాణా 21, మానవ్ సుతార్ 20, రాజవర్ధన్ హంగర్గేకర్ 20, యువరాజ్‌సింగ్ దోడియా 22.

పాక్ జట్టులో 29 ఏళ్ల క్రికెటర్.. యువకుడు

పాకిస్తాన్ తుది జట్టులో ముగ్గురు వయసు మళ్ళిన వారే. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తయ్యిబ్ తాహిర్(108) వయసు 30 ఏళ్లు. ఇక 65 పరుగులతో రాణించిన షాహిబ్జాదా ఫర్హాన్‌కు 27 ఏళ్లు. మరో క్రికెటర్ ఒమైర్ యూసుఫ్ కు 24 ఏళ్లు. ఇలా దాదాపు అందరూ 20 ఏళ్లు పైబడినవారే. వీరిని యువ జట్టులో కలపడం ఎంత వరకు సమంజసమని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. 

భారత్ అంటే భయమా?

యువ జట్టు ఆటగాళ్లు అయితే భారత్‌ను ఓడించలేరన్న భయంతోనే పీసీబీ.. వీరిని జట్టులో చేర్చిందని నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే పాక్ అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.