
- ఏటా 2 టీఎంసీలకు పైనే వేస్టేజీ
- నెట్టెంపాడు ప్రాజెక్టు కాలువల పరిస్థితి
- అసంపూర్తి పనులతో జోగులాంబ గద్వాల రైతుల కష్టాలు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్న లక్ష్యంతో నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోంది. దీని కింద కాలువలు తవ్వారు.. కానీ, ఒక్కదానికి కూడా లైనింగ్ చేయకపోవడంతో నీరు వృథాగా పోతోంది. మరోవైపు ర్యాలంపాడ్ రిజర్వాయర్ కు రిపేర్లు చేయడం లేదు. పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని రైతులకు కష్టాలు తప్పడం లేదు.
164 కి.మీ. మేర కాలువలు
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఫేస్-–1 లో 84 కిలోమీటర్లు, ఫేస్-–2 లో 80 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ 100 కిలోమీటర్లకు పైగానే ఉంటాయి. ప్రభుత్వం అనుమతి ఇస్తే డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు లైనింగ్ వేసే అవకాశాలున్నాయి.
20 వేల ఎకరాలకు సరిపడే నీరు వృథా..
మెయిన్ కెనాల్స్ తోపాటు పిల్ల కాలువలు, సబ్ డిస్టిబ్యూటరీలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు అన్నింటికీ లైనింగ్ చేయలేదు. దీంతో, ఏటా 2 టీఎంసీలకు పైగా నీరు వృథా అవుతున్నట్లు ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. వారి అంచనా మేరకు ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంటే 10 వేల ఎకరాలకు సాగు నీరివ్వొచ్చు. ఈ లెక్కన 2 టీఎంసీలంటే 20 వేల ఎకరాలకు సరిపడే నీరు వృథా అవుతున్నట్టే లెక్క. లైనింగ్ చేస్తే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతోనే పంటలకు సరిపడా నీరందుతుంది.
4 టీఎంసీలైతే.. 2 టీఎంసీలే నిల్వ
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగా ఉండడం రైతులకు శాపంగా మారుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ర్యాలంపాడ్, గుడ్డం దొడ్డి, చిన్నోనిపల్లి, సంగల, ముచ్చోనిపల్లి, నాగర్ దొడ్డి రిజర్వాయర్లు నిర్మించారు. కానీ, ఇప్పటివరకు సంగాల, చిన్నోనిపల్లి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం ర్యాలంపాడ్ రిజర్వాయర్ బుంగలు పడడంతో అందులో పూర్తిస్థాయిలో నీటిని నింపడం లేదు. 4 టీఎంసీలకు గానూ కేవలం 2 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. అలాగే, 99 వ ప్యాకేజీలో కొన్ని పనులు ఇంకా పెండింగ్ లో నే ఉన్నాయి. ఫలితంగా నెట్టెంపాడు పరిధిలోని పూర్తి ఆయకట్టుకు నీరివ్వలేని దుస్థితి నెలకొంది. చేతికొచ్చే సమయంలో నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితులున్నాయని, ప్రభుత్వం స్పందించి, పెండింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం
నెట్టెంపాడు ప్రాజెక్ట్కాలువలకు లైనింగ్ చేసే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. లైనింగ్ చేయకపోవడం వల్ల కొంత నీరు వృథా అవుతున్న మాట వాస్తవమే. పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.- రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ