
- వేధిస్తున్న నెట్వర్క్ ప్రాబ్లం
నాగర్‌కర్నూల్/అచ్చంపేట, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్లో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం 23వ రోజుకు చేరింది. టన్నెల్లో మనుషులు వెళ్లలేని డి1తో పాటుచివరి ప్రాంతంలో మట్టిని తవ్వేందుకు, రాళ్లు, శిథిలాలు ఎత్తిపోసి బయటికి తరలించేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలంలో నెట్ వర్క్ ప్రాబ్లం ఎదురవుతోంది. టన్నెల్లో బీఎస్ఎన్ఎల్ 3జి నెట్వర్క్ అందుబాటులో ఉండగా, అన్వి సంస్థ రోబో పని చేయడానికి 5జి నెట్వర్క్ స్పీడ్ అవసరం అవుతోంది.
మాస్టర్ రోబో నుంచి టన్నెల్ లోపల పని చేసే అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోకు 5జి నెట్వర్క్ సెటప్‌తో కమాండ్స్ సెట్ చేశారు. టన్నెల్ లో బీఎస్ఎన్ఎల్ 3జి నెట్వర్క్ మాత్రమే పని చేయడంతో సమస్య వచ్చినట్లు సమాచారం. 3జి నెట్వర్క్ సెటప్‌తో రోబోలు పని చేసేలా ప్రయత్నిస్తున్నారు.
కొనసాగుతున్న రెస్క్యూ ..
టీబీఎం బేస్, ఇతర విడిభాగాలను గ్యాస్ కటర్లతో తొలగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేసి మట్టిని తవ్వుతున్నారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే దానిపై వేసేలా రాళ్లను పగలగొడుతున్నారు. లోకో ట్రాలీల వరకు కట్ చేసిన విడిభాగాలు, మట్టిని, రాళ్లను మోస్తున్నారు.13.500 కిలోమీటర్ల తర్వాత సీపేజీసమస్య ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 5 పంపులు కంటిన్యూగా పని చేస్తున్నా నీటి ఉధృతి తగ్గడం లేదు.
ఆదివారం ఉదయం టన్నెల్ లోపలికి వెళ్లిన కేరళ పోలీస్‌కు చెందిన క్యాడవర్ డాగ్ స్క్వాడ్‌ను మట్టి తవ్విన ప్రాంతంలో 4 మీటర్ల కింద ఉన్న టీబీఎం బేస్ పరిసరాల్లో తిప్పారు. కలెక్టర్ బదావత్ సంతోష్ ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్లు, అన్వి రోబో సర్వీసెస్ ఇన్‌చార్జీలతో రెండు సార్లు రివ్యూ నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న సింగరేణి జీఎం బైద్య టన్నెల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్‌కు వివరించారు. రెస్క్యూ బృందాలు ఉండేందుకు దోమలపెంటలో ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. వారికి కావాల్సిన అన్ని సౌలతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.