కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా  దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నామినేషన్ వేశారు.  కంటోన్మెంట్ బోర్డు కార్యలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురు నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.  నివేదిత తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా తన చరాస్తులు రూ.85.42 లక్షలుగా పేర్కొనగా అప్పులు మాత్రం రూ.86.45 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు.  

నామినేషన్ వేయడానికి ముందు కాకాగూడా లోని  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ కష్టకాలంలో కేసీఆర్ తమ వెంట నిలిచారని, ప్రజల మద్దతుతోనే తాను ఎన్నికల బరిలో ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందని కచ్చితంగా ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని నివేదిత ధీమా వ్యక్తం చేశారు.

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం1957లో ఏర్పడగా, 1969లో మొదటిసారి ఉప ఎన్నికలు జరిగాయి. మే13న జరిగేవి రెండో ఉప ఎన్నికలు. ఐదు సార్లు కంటోన్మెంట్ సెగ్మెంట్​కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సాయన్న గతేడాది అనారోగ్యంతో మృతి చెందగా, గతేడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతరు లాస్య నందిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

అయితే ఆమె 82 రోజులు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగారు. గత నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.