గులాం మొహమ్మద్ బక్ష్ బట్. ఈ పేరు చెప్తే తెలియకపోవచ్చు కానీ ‘ది గ్రేట్ గామా’, ‘గామా పహిల్వాన్’గా పాపులర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈయనో గొప్ప కుస్తీ వీరుడు అన్నమాట. ఐదు దశాబ్దాలు రెజ్లర్‌గా ఉన్న ఈయన మొత్తం కెరీర్లో ఓటమి అంటే తెలియదు. కుస్తీ పట్టుకు బరిలో దిగితే విజయం పట్టుకుని రావాల్సిందే.ఈయన కెరీర్ దాదాపు 50 ఏండ్లు... అన్నేండ్లూ ఓటమి అనేది ఎరగడు. కుస్తీపోటీల్లో గెలుపే కాకుండా స్వతంత్ర పోరాట సమయంలో దేశప్రజలను ఉత్సాహపరిచాడు. రెజ్లర్‌గా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న గామా... మార్షల్ ఆర్ట్స్ చాంపియన్, నటుడు బ్రూస్లీకి ఇన్స్పిరేషన్! ఇంత ఫేమస్ అయిన గామా గురించి తెలుసుకోకపోతే ఎలా?
గామాది కాశ్మీరి ముస్లిం కుటుంబం. దేశవిభజనకు ముందు ఉన్న పంజాబ్‌లో ఉండేవాళ్లు. దాంతో దేశ విభజన టైమ్‌లో అతను పాకిస్తాన్లో ఉండిపోయాడు. విభజన తరుణంలో హిందువుల మీద దాడులు జరుగుతుంటే చాలామంది హిందువుల ప్రాణాలను రక్షించాడు కూడా.
చిన్ని బుర్రలో గట్టి ఆశ
కపర్తలా జిల్లా, జబ్బోవాల్ అనే ఊర్లో 1878, మే 22న పుట్టాడు గామా. వాళ్ల ఫ్యామిలీలో కుస్తీ(రెజ్లింగ్) అనేది ఒక భాగం. గామా తండ్రి మొహమ్మద్ అజీజ్ బక్ష్, దటియా మహారాజు భవాని సింగ్ ఆస్థాన రెజ్లర్‌గా ఉండేవాడు. గామాకు ఆరేండ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఆయన చనిపోయేలోపే గామా చిన్న బుర్రలో ప్రపంచంలో గొప్ప రెజ్లర్ కావాలనే ఆశను నాటాడు. తండ్రి చనిపోయాక గామాతో కలిపి తమ్ముడ్ని, తల్లిని తాత నన్ పహిల్వాన్ తీసుకెళ్లాడు. గామా బాధ్యత మేనమామ ఇడా పహిల్వాన్ తీసుకున్నాడు. గామాను చాంపియన్ పహిల్వాన్‌గా చేయడంలో కీ రోల్ మేనమామదే.
వయసుతో పనేంటని...
గామా వయసు పదేండ్లప్పుడు జోధ్‌పూర్ మహారాజు స్క్వాట్స్(మోకాళ్లను వంచి నేలమీద గొంతుకు కూర్చుని లేవడం ) ఎవరు ఎక్కువ చేస్తారనే కాంపిటీషన్ పెట్టాడు. అందులో దాదాపు నాలుగొందల మంది పార్టిసిపేట్ చేశారు. వాస్తవానికి స్క్వాట్స్ చేయడం అనేది రెజ్లర్‌కు కామన్ ట్రైనింగ్. కానీ అన్ని వందల మంది పాల్గొన్న పోటీలో అతితక్కువ వయసు ఉన్నది గామాకే. పిలగాడు చిన్నోడే కానీ అంతమందితో పోటీపడి మరీ చివరకు మిగిలిన 15 మందిలో ఒకడిగా నిలిచాడు. మెచ్చుకోవాల్సిన విషయం కదా! కానీ పోటీలో నిలిచేందుకు అతను పడిన శ్రమ అతడ్ని ఆ తరువాత వారం రోజులు బెడ్ దిగనీయకుండా పడుకోబెట్టింది. ఏదేమైనా గామాలోని పట్టుదల రెజ్లింగ్ అధికారుల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఇండియా అంతటా జరిగే పోటీల్లో పాల్గొనమని బోలెడు ఇన్విటేషన్స్ వచ్చాయి గామాకు.
ఒక్కరోజుతో వచ్చింది కాదు
మేనమామ ఇచ్చిన శిక్షణతో పదిహేనేండ్ల నుంచే పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. అయితే ఇదంతా ఏ ఒక్క రోజులోనో సాధ్యమైంది కాదు. చిన్నప్పట్నించే స్ట్రిక్ట్ ప్లాన్ ఫాలో అయ్యేవాడు అతను. 500 స్క్వాట్స్, 500 దాండ్స్(జాక్–నిఫింగ్ పుష్ అప్స్(దండీలు)) చేయడంతో పాటు ప్రతిరోజూ గుంతలు తవ్వేవాడు. తిండి కూడా గట్టిగానే తినేవాడు. పాలు, పండ్లు, బాదంలను రోజూవారీ డైట్లో కచ్చితంగా తినేవాడు. పదిహేనేండ్లు వచ్చేసరికి మాంసం, వెన్న, యాఖ్ని(ఎముక మజ్జ) సూప్, కీళ్లు, టెండాన్స్ డైట్‌లోకి చేరాయి. తండ్రికి మల్లే గామా మహరాజా దటియా ఆస్థాన రెజ్లర్‌గా ఉన్నాడు. అక్కడ ట్రైనింగ్ యూనిట్ ఉండేది.
దినచర్య ఇలా...
గామా ప్రతిరోజూ మూడువేల స్క్వాట్స్, 1500 డాండ్స్ చేసేవాడు. 120 పౌండ్ల బరువు ఉన్న రాయిని మెడకు కట్టుకుని ఒక మైలు దూరం పరిగెత్తేవాడు. రోజుకు పది లీటర్ల పాలు, అర కిలో నెయ్యి, లీటరున్నర వెన్న, రెండు కిలోల పండ్లు ఆస్థానం నుండి వచ్చేవి. ఈ విషయాన్ని అమెరికన్ ఆంత్రోపాలజిస్ట్ జోసెఫ్ ఎస్ ఆల్టర్ రాసిన ‘ది రెజ్లర్స్ బాడీ: ఐడెంటిటీ అండ్ ఐడియాలజీ ఇన్ నార్త్ ఇండియా’ అనే పుస్తకంలో రాశారు.
కొండను ఢీకొన్నాడు
పందొమ్మిదిదేండ్లకే గామా రెజ్లింగ్ కెరీర్ ఆకాశాన్ని అంటింది. ఇండియన్ రెజ్లింగ్ చాంపియన్ రహీమ్ బక్ష్ సుల్తాని వాలాతో చాలెంజ్ చేశాడు. రహీం ఆరు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు ఉంటాడు. అంత ఎత్తున్న మనిషితో ఐదడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తున్న గామా చాలెంజ్ చేయడం వేస్ట్ అనుకున్నారంతా. గామా గెలుస్తాడని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. రెజ్లింగ్ ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న గామా కలలు ఈ పోటీతో కల్లలైనట్టే అని కూడా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. రహీంతో పోటీపడి కొన్ని గంటల పాటు రింగ్‌లో నిలిచాడు గామా. ఆట డ్రా అయింది. మళ్లీ జరిగిన మ్యాచ్‌లో కూడా గట్టి పోటీ ఇద్దరి మధ్యా... చివరికి ఇద్దరూ విపరీతమైన గాయాలతో నిలిచారు.
ఆస్థాన రెజ్లర్
పటియాలా మహారాజు ఆస్థానంలో రెజ్లర్‌గా అయ్యే రెండేండ్ల ముందు... అంటే 1910లో రహీమ్‌ను తప్ప ఇండియాలో ఉన్న ఫేమస్ రెజ్లర్స్ అందరినీ ఓడించాడు. సరిగ్గా అదే టైంలో స్వాతంత్ర పోరాటం కూడా తీవ్రంగా జరుగుతోంది. అదే ఏడాది గామాను జాన్ బుల్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలకు లండన్ పంపించారు. అప్పుడు గామాతో పాటు అతని తమ్ముడు, మరో ఇద్దరు రెజ్లర్స్, శరత్‌కుమా మిత్ర అనే బెంగాలీ మిలియనీర్ కూడా వెళ్లాడు. ఆ పోటీలకు అతనే స్పాన్సర్. తీరా అక్కడికి వెళ్లాక.. ‘‘గామా చాలా పొట్టిగా ఉన్నాడు. పోటీల్లో పాల్గొనేందుకు పనికిరాడు’’ అన్నారు. దాంతో చాలా నిరుత్సాహపడ్డాడు గామా. పోటీల్లో అయితే పాల్గొనే ఎలిజిబిలిటీ లేదు కానీ లండన్‌లోని ఒక లోకల్ థియేటర్లో జరిగే సైడ్‌షో బౌట్స్ (రెజ్లింగ్ పోటీలు) సిరీస్‌లో అవకాశం ఇచ్చారు. అందుకు వారానికి 250 పౌండ్లు ఇస్తామన్నారు.
అలా వచ్చింది అనుమతి
గామాను కాంపిటీషన్లోకి అనుమతించకపోవడం గురించి మరో వెర్షన్ కూడా ఉంది. భారతీయ కుస్తీ పత్రిక ఎడిటర్ రతన్ పటోడి 2014లో మాట్లాడుతూ ‘‘గామా లండన్ వెళ్లాక, 88 కిలోల బరువు తూగాడు. దాంతో గామాకు హెవీవెయిట్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎలిజిబిలిటీ లేదనే విషయం అర్థమైంది. దాంతో అతని మేనేజర్ ఒక చాలెంజ్ విసిరాడు. ‘లండన్‌లో ఉన్న ఏ రెజ్లర్‌తో అయినా గామా కుస్తీ పోటీపడతాడు’ అని. కుస్తీ రింగ్‌లో ఐదు నిమిషాలు ఉండగలిగితే వాళ్లకు ఐదు డాలర్లు ఇస్తా అన్నాడు గామా. మొదటి రెండు రోజులు 15 మంది ఇంగ్లీష్ చాలెంజర్లను ఎదుర్కొన్నాడు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం బయటకు పొక్కి గామాతో చాలెంజ్ చేసేందుకు చాలామందే వచ్చారు. అమెరికన్ చాంపియన్ బెంజిమెన్ రోలర్‌ను మూడు నిమిషాల్లో ఓడించాడు గామా. 30 మంది జపాన్ రెజ్లర్స్‌ను ఓడించాడు. ఎవరు చాలెంజ్ స్వీకరిస్తే వాళ్లను ఓడించడమే గామా పని. దాంతో జాన్ బుల్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆర్గనైజర్స్కు గామాను పిలవక తప్పింది కాదు. అఫీషియల్ టోర్నమెంట్‌కు యాక్సెస్ ఇచ్చారు. అక్కడ వరల్డ్ చాంపియన్, పోలెండ్‌కు చెందిన స్టానిస్లాస్ బిస్జెకోతో పోటీపడ్డాడు.
వరల్డ్ చాంపియన్‌గా నిలిచి...
భారీగా లేకపోతేనేం ప్రత్యర్థితో మూడు గంటలు పోటీపడ్డాడు గామా. పోటీ ముగిసే టైంకు గామాదే పైచేయి. మరుసటిరోజు కూడా స్టానిస్లాస్ కుస్తీ పోటీలో ఫెయిల్ అయ్యాడు. దాంతో గామాను వరల్డ్ చాంపియన్‌గా ప్రకటించారు. కానీ ఇండియాలో మాత్రం హిందీ, ఉర్దూ న్యూస్పేపర్లలో అందుకు సంబంధించిన వార్తే రాలేదు” అని అప్పటి సంగతులు చెప్పాడు. అంటే నేషనల్ చాంపియన్ అయ్యేకంటే ముందు వరల్డ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు గామా. ఇండియాకు తిరిగొచ్చాక రహీమ్‌ను మళ్లీ కుస్తీ పోటీల కోసం పిలిచాడు. లండన్‌లో గెలిచిన రెండేండ్ల తరువాత గామా, రహీమ్ యాభైవేల మంది జనాల ముందు అలహాబాద్‌లో పోటీపడ్డారు. ఇండియాలో జరిగిన కుస్తీ పోటీల్లో ఇది చాలా ముఖ్యమైనది. దాదాపు దేశమంతా దీని గురించి మాట్లాడుకున్నారు. ఈ పోటీలో రహీమ్‌ను గామా పహిల్వాన్ ఓడించి ‘రుస్తుం ఎ హింద్’ (చాంపియన్ ఆఫ్ ఇండియా) టైటిల్ గెలుచుకున్నాడు.
మరోసారి చాలెంజ్
ఆ తరువాత పదహారేండ్లకు మరో ముఖ్యమైన కుస్తీ పోటీ జరిగింది. పటియాలా మహారాజు దగ్గర పదహారేండ్లు ఆస్థాన రెజ్లర్‌గా ఉన్న గామాకు స్టానిస్లాస్ మరోసారి చాలెంజ్ విసిరాడు. ఈ సారి లక్షమంది జనాల ముందు. 50 ఏండ్ల గామా స్టానిస్లాస్ను 42 సెకన్లలో ఓడించాడు. పటియాలాలో జరిగిన ఈ కుస్తీ పోటీ పూర్తిగా ఒకవైపు జరిగిందని చెప్పొచ్చు.
‘‘ఈ విజయం తరువాత మహారాజు గామాను మెచ్చుకున్నాడు. మెడలోని ముత్యాల నెక్లెస్‌ను తీసి చాంపియన్ మెడలో వేశాడు. ఆ తరువాత ఒక పెరేడ్ ఏర్పాటు చేశాడు. అందులో గామా మహారాజు గారి ఏనుగు మీద కూర్చుని, వెండి కర్ర (ఈ పెరేడ్ కోసం ప్రత్యేకంగా చేయించింది) పట్టుకున్నాడు. గామా సాధించిన ఘనమైన ఆ విజయాన్ని ఎవరూ మర్చిపోలేరు. రాజు అతడికి ఆ గ్రామాన్ని ఇచ్చేసి, సంవత్సరానికి ఆరువేల రూపాయల జీతం ఇచ్చాడు. ఈ పోటీతో పటియాలా మహారాజు గౌరవం మరింత పెరిగింది. కుస్తీ పోటీల్లో పటియాలా రాజు విజయపరంపర కొనసాగింది. పట్టుదలకు గామా ఎగ్జాంపుల్‌గా నిలిచాడు” అని ఆల్టర్ పుస్తకంలో రాశాడు. అతడి చివరి కుస్తీ పోటీ ఆ తరువాత ఏడాది స్వీడిష్ రెజ్లర్ జెస్సె పీటర్సన్‌తో జరిగింది.
సేఫ్ కాదని...
దేశ విభజనకు ముందు అంటే 1947 కంటే ముందు గామా అమృతసర్‌లో ఉండేవాడు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మతఘర్షణలు దెబ్బతీశాయి. దాంతో గామా లాహోర్‌కు వెళ్లిపోయాడు. హిందూ కుటుంబాలు ఉంటున్న కాలనీలో సెటిల్ అయ్యాడు. అక్కడ కూడా చాలా కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు.
ఆ కాలనీవాళ్ల మీద లోకల్గ్యాంగులు దాడికి వచ్చాయి. గామా, ఆయనతో ఉన్న ఇతర రెజ్లర్స్... కత్తులు, గొడ్డళ్లు పట్టుకుని ఆ కాలనీ మీద దాడికి వచ్చిన వాళ్లతో పోరాడారు. దాడిచేసేందుకు వచ్చిన గ్యాంగులు పారిపోయాయి. కానీ, పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. దాంతో లాహోర్‌లో ఉండడం హిందూ కుటుంబాలకు సేఫ్ కాదనుకున్నాడు. అన్ని ఖర్చులు తనే పెట్టుకుని వాళ్లకి తోడుగా ఉండి ఆ కాలనీ నుంచి సరిహద్దులకు చేర్చి... వీడ్కోలు చెప్పాడు.
గామా చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డాడు. అప్పటి పాకిస్తానీ ప్రభుత్వం అతనికి ఎటువంటి సాయం చేయలేదు. 1960లో 82 ఏండ్ల వయసులో మరణించాడు. ఆయనలోని సాహసాన్ని ఇప్పటికీ కొల్హాపూర్ తాలీమ్స్లో, హర్యానాలోని అఖాడాల్లో కథలు కథలుగా చెప్తుంటారు. ఈ లెజెండరీ రెజ్లర్ గురించి ఆర్టికల్స్ చదివాక బ్రూస్లీ తన ట్రైనింగ్‌లో గామా చేసిన స్క్వాట్స్, పుష్ అప్స్‌ను పెట్టుకున్నాడు.