- ట్రాన్స్కో సీఎండీకి వినతి
కుభీర్, వెలుగు: తమ ఇండ్లపై వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లను తొలగించాలని కోరుతూ కుభీర్ మండల కేంద్రంలోని న్యూ అబాది కాలనీ వాసులు సోమవారం ట్రాన్స్కో సీఎండీ వరుణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మండల అధ్యక్షుడు సాప పండరి మాట్లాడుతూ.. 2012లో విద్యుత్ వైర్లు తెగిపడి పది ఇండ్లు కాలి బూడిదయ్యాయని, ప్రాణాలతో బయటపడ్డప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని గుర్తుచేశారు.
విద్యుత్ లైన్ మార్చాలని అధికారులకు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఆ లైన్ను తొలగించాలని ఇటీవల కాలనీవాసులు అంతా కలిసి డబ్బులు జమ చేసి డీడీలు చెల్లించినప్పటికీ 11 కేవీ లైన్ మార్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వారి సమస్యను విన్న ట్రాన్స్కో సీఎండీ.. ఇప్పటివరకు లైన్ తొలగించకపోవడానికి కారణాలను తెలుసుకొని త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.