ధరణి స్థానంలో కొత్త చట్టం

ధరణి స్థానంలో కొత్త చట్టం
  • డ్రాఫ్ట్​ సిద్ధం చేసినం: మంత్రి పొంగులేటి 
  • ప్రజల సలహాలు, సూచనలతో తుదిరూపు
  • అసెంబ్లీలో మంత్రి ప్రకటన

హైదరాబాద్, వెలుగు : ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నామని, ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు కూడా సిద్ధమైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి తెలిపారు. ఈ డ్రాఫ్ట్‌‌ బిల్లును వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్ చేస్తామని, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

రైతులు, మేధావులు సహా ప్రజలందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని.. వాటిపై చర్చించి కొత్త చట్టానికి సంబంధించిన బిల్లుకు తుదిరూపు తీసుకొస్తామని వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ధరణిపై షార్ట్ డిస్కషన్ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. 

తాము తీసుకొచ్చే కొత్త చట్టం పూర్తిగా రైతు నేస్తంగా ఉండబోతున్నదని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘‘బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణి చట్టం వల్ల కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడినట్టు అయింది. తనకు తానే అపర మేధావిగా భావించే ఓ పెద్దాయన(కేసీఆర్), ఓ ఉన్నతాధికారి(మాజీ సీఎస్‌‌‌‌ సోమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌) గడీల మధ్య కూర్చుని రూపొందించిన ధరణి.. తెలంగాణ రైతులకు శాపంగా మారింది. 

ధరణి వల్ల ఉన్న సమస్యలు తీరకపోగా, కొత్త సమస్యలు వచ్చాయి. రావణుడికి పది తలలు ఉంటే, ధరణి అనే రావణుడు 33 తలలతో అవతరించాడు” అని అన్నారు. ‘‘తెలంగాణ కుటుంబాల్లో ధరణి రూపంలో చిచ్చుపెట్టిన దొరలు.. వేల కోట్లు దోచుకుని, తమ గడీలను ధన రాశులతో నింపుకున్నారు. అందుకే తెలంగాణలోని ప్రతి కుటుంబం ఉసురు తగిలి.. దొర తన గడీలోనే బందీ అయ్యాడు. 

తెలంగాణ ప్రజలకు తన ముఖం చూపెట్టుకోలేక దాక్కున్నాడు” అని విమర్శించారు. తాము తీసుకొచ్చే బిల్లుపై గడీ దాటని దొర కూడా తన సలహాలు ఇవ్వొచ్చునని చెప్పారు. 

అధ్యయనం చేశాకే చట్టం తెస్తున్నాం.. 

ధరణి వల్ల 30 లక్షల మంది రైతులకు కొత్తగా భూసమస్యలు పుట్టకొచ్చాయని పొంగులేటి అన్నారు. ‘‘మేం అధికారంలోకి వచ్చే నాటికి ధరణి సమస్యలపై 2.48 లక్షల దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చాక మరో 1.84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2.76 లక్షల దరఖాస్తులకు పరిష్కారం చూపించాం” అని తెలిపారు. 

గత సర్కార్ తీసుకున్న ఏకపక్ష  నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. తాము మాత్రం అలా చేయబోమని, అందరి సలహాలు, సూచనలతో చట్టాలు తెస్తామని చెప్పారు. ‘‘ఇప్పటికే 18 రాష్ట్రాల్లో ఉన్న భూచట్టాలపై అధ్యయనం చేయించాం. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, భూసంస్కరణలు తదితర అంశాలపై అధ్యయనం చేయించాకే డ్రాఫ్ట్ బిల్లు తయారు చేయించాం. 

ధరణి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తాయో తెలుసుకునేందుకు యాచారం మండలం, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని మరో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం ఎంపిక చేసి స్టడీ చేయిస్తున్నాం. ఈ స్టడీ రిపోర్ట్‌‌‌‌ మరో 15 రోజుల్లో వస్తుంది. ఆ తర్వాత డ్రాఫ్ట్ బిల్లును వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేస్తాం” అని వెల్లడించారు.