సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ జనరేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దూసుకుపోతోంది. దీనికి మీడియా, వైద్యం, ఐటీ వంటి ముఖ్య రంగాలు ప్రభావితమవుతుండగా.. ఇప్పుడు ఏఐ సాయంతో శాస్త్రవేత్తలు మరో కీలక పురోగతి సాధించారు. ఇటీవలి కాలంలో దేశంలో మరోమారు కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ 1కేసులు పెరుగుతున్న క్రమంలో.. తాజాగా ఈ మహమ్మారిని గుర్తించేందుకు ఓ కొత్త ఆవిష్కరణ చేశారు. దీని వల్ల కొవిడ్ వ్యాప్తిని ముందుగానే పసిగట్టడమే కాకుండా.. అది వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందంటున్నారు పరిశోధకులు. ఇదొక అద్భుత సృష్టి అని పేర్కొంటున్నారు.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) పరిశోధకులు రూపొందిన ఈ కొత్త, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో SARS-CoV-2 వేరియంట్‌లను ముందుగానే అంచనా వేయొచ్చు. 30దేశాల నుంచి వచ్చిన డేటాతో అధ్యయనం చేసిన ఎంఐటీ.. దాదాపు 9మిలియన్ల SARS-CoV-2 జన్యు శ్రేణులను విశ్లేషించి.. ఇన్ఫెక్షన్ రేట్లు, వైరస్ వ్యాప్తిని ప్రభావితం చేసే ఇతర సంబంధిత అంశాలను పరిశీలించింది.
PNAS Nexus జర్నల్‌లో ప్రచురించబడిన వారి పరిశోధనల ప్రకారం, ఈ విశ్లేషణ నుంచి వచ్చిన నమూనాలు మెషిన్ లెర్నింగ్-ఎనేబుల్డ్ రిస్క్ అసెస్‌మెంట్ మోడల్‌ను రూపొందించడానికి ఉపయోగించబడ్డాయి. నివేదిక ప్రకారం, ఈ మోడల్ వల్ల ప్రతి దేశంలో 72.8% వేరియంట్‌లను గుర్తించగలదు.
మెషిన్ లెర్నింగ్ మోడల్ కొత్త SARS-CoV-2 వేరియంట్‌ల వ్యాప్తి ప్రమాదానికి మెరుగైన ముందస్తు సంకేతాలను అందించడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నివేదిక ప్రకారం, ఇన్ఫ్లుయెంజా, ఏవియన్ ఫ్లూ లాంటి ఇతర కరోనా వైరస్, ఇతర శ్వాసకోశ వైరస్‌లకు ఇదే విధానాన్ని వర్తింపజేయవచ్చు.