
గూగుల్ కంపెనీ ఒకేసారి నాలుగు ఫీచర్లతో సర్ప్రైజ్ చేసింది. యూజర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్లను లాంచ్ చేసింది. అవేంటంటే.. స్కామర్ల నుంచి కాపాడుకునేందుకు స్కామ్ డిటెక్షన్, పోగొట్టుకున్న డివైజ్ వెంటనే వెతికి పట్టుకోవడానికి లైవ్ లొకేషన్ షేరింగ్ వంటివి. వీటితోపాటు ప్రజలు ఎంతో ఇష్టపడే షాపింగ్, ఆన్లైన్ గేమ్స్ విషయంలో కూడా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
స్కామ్ డిటెక్షన్
స్కామర్లకు చెక్ పెట్టడానికి గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే స్కామ్ డిటెక్షన్ ఫీచర్. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ మెసేజెస్ యాప్‌కి వచ్చే ఎస్ఎంఎస్లన్నీ ఈ ఫీచర్ స్కాన్ చేస్తుంది. స్కామ్ మెసేజ్‌లా ఉంటే వెంటనే ఏఐ సాయంతో దాన్ని గుర్తించి, యూజర్‌కు స్కామ్ అలర్ట్ నోటిఫికేషన్ పంపిస్తుంది. అలాంటి మెసేజ్‌లు ఏవైనా వస్తే సంబంధిత కాంటాక్ట్‌ను రిపోర్ట్ లేదా బ్లాక్ చేయొచ్చు.
లైవ్ లొకేషన్ షేరింగ్
ఆండ్రాయిడ్ యూజర్లకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ‘ఫైండ్ మై డివైజ్’ వాడేవాళ్లు ఇకపై లైవ్ లొకేషన్ షేర్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఫైండ్ మై డివైజ్ అనే ఫీచర్ పోయిన ఫోన్ వెతకడానికి పనికొస్తుంది. అయితే, లైవ్ లొకేషన్ షేరింగ్ ద్వారా కాంటాక్ట్స్‌కి పంపేటప్పుడు టైం కూడా సెట్ చేసుకోవచ్చు. లొకేషన్‌తో పాటు బ్యాటరీ లెవల్ కూడా చూపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌కి లొకేషన్ షేర్ చేయడం ద్వారా వెంటనే డివైజ్‌ని వెతికి పట్టుకోవచ్చు.
క్రోమ్‌లో షాపింగ్
క్రోమ్‌లో షాపింగ్ సైట్స్ చూసేవాళ్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా ప్రొడక్ట్స్ ప్రస్తుత ధరలు, దాని హిస్టరీ వంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ధర తగ్గినప్పుడు వెంటనే తెలియాలంటే అందుకోసం ట్రాక్ బటన్ ట్యాప్ ఆన్‌లో పెట్టాలి. తద్వారా ప్రొడక్ట్ ధర తగ్గిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
డౌన్లోడ్ గేమ్స్
డ్రైవింగ్ చేసేటప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్లకూ ఒక గుడ్ న్యూస్. అదేంటంటే.. ఫామ్ హీరోస్ సాగా, క్యాండీ క్రష్ సోడా సాగా, యాంగ్రీ బర్డ్స్ 2, బీచ్ బగ్గీ రేసింగ్ వంటి గేమ్స్ ఆండ్రాయిడ్ ఆటోలో అందుబాటులోకి వచ్చాయి. అయితే కేవలం వెహికల్ పార్క్ చేసినప్పుడు మాత్రమే ఈ గేమ్స్ ఆడేందుకు వీలు కల్పించింది. డ్రైవింగ్ చేసేటప్పుడు గేమ్‌లో మీద ధ్యాస పెట్టి, ప్రమాదంలో పడకుండా ఉండేందుకే ఈ ఆలోచన చేసినట్టు చెప్పింది ఆ కంపెనీ.