* పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
* అర్హులందరికీ అవకాశం కల్పిస్తాం
* సాంకేతికతను వినియోగించుకోవాలి
* స్వల్ప మార్పులు సూచించాను
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రూపొందించామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. వచ్చే వారం నుంచి ఈ యాప్ ను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ యాప్ ను ఇవాళ ఆయన సచివాలయంలో పరిశీలించి మార్పులకు సూచనలు చేశారు. ముఖ్యంగా తెలుగులోనూ డిస్ ప్లే అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పధకాన్ని ప్రారంభిస్తామని, ఇందుకు కావలసిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంతవరకు వాడుకోవాలని సూచించారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు. సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.