- మీ సేవ ఆధ్వర్యంలో మీ టికెట్ యాప్!
- బస్సు, మెట్రో, పార్కులు, గుళ్లు సహా అన్ని రకాల టికెట్లు ఒకే యాప్‌లో
- ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
- ఇతర యాప్స్‌లో లాగా యూజర్ చార్జీలు ఉండవన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: బర్త్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు సహా వివిధ సేవలను అందిస్తున్న మీ సేవ.. ఇప్పుడు టికెట్లను కూడా తీసుకునే కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. బస్సు, రైలు, గుడి సహా అన్ని టికెట్లనూ ఒకే ఒక్క క్లిక్‌తో తీసుకునేలా ‘మీ టికెట్’ యాప్‌కు మీ సేవ రూపకల్పన చేసింది.
క్యూలైన్లో నిలబడాల్సిన అవసరమే లేకుండా.. ఆర్టీసీ, మెట్రో రైలు టికెట్లు, ప్రముఖ దేవాలయాల్లో దైవదర్శనం, పార్కులు, పర్యాటక ప్రదేశాల్లో టికెట్లను ఈ మీ టికెట్యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ) రూపొందించిన ఈ ‘మీ టికెట్’ యాప్‌ను ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గురువారం సెక్రటేరియెట్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సుపరిపాలన అందించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముందుకు చేరవేస్తున్నామన్నారు.
అన్ని రకాల టికెట్ల బుకింగ్‌ను ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా మీ టికెట్ యాప్‌ను రూపొందించామని చెప్పారు. రాష్ట్రంలోని 15 ప్రముఖ గుడులు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్జోన్స్కు సంబంధించిన టికెట్లను ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చని ఆయన తెలిపారు.
ALSO READ : ఇకపై చట్టంగా భూభారతి..మెరుగైన రెవెన్యూ సేవలు
జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. వెళ్లబోయే లొకేషన్‌ను ఎంచుకుంటే.. దానికి సమీపంలోని చూడదగిన ప్రదేశాల లిస్టు కూడా యాప్‌లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుందని ఆయన వివరించారు.
యూపీఐ ద్వారా ఈజీగా పేమెంట్స్ చేయొచ్చని, ఇతర యాప్లలోలాగా ఇందులో యూజర్ చార్జీలను కూడా వసూలు చేయడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కమిషనర్ రవి కిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ జి.మల్సూర్, జూపార్క్ డైరెక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.