ఎర్రమంజిల్ ఎన్నో చూసింది..

హైదరాబాద్​లోని ఎర్రమంజిల్ భవనాలను కూలగొట్టి కొత్త అసెంబ్లీ బిల్డింగ్​ కట్టాలని కేసీఆర్​ సర్కార్​ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై వాదనలు కూడా పూర్తయ్యాయి. ఎర్రమంజిల్​ ప్యాలెస్​ వారసత్వ(హెరిటేజ్​) కట్టడమని పర్యావరణవేత్తలు చెబుతుండగా గవర్నమెంట్​ ఖండిస్తోంది. హైకోర్టు తీర్పు వాయిదా పడటంతో ప్రస్తుతానికి సర్దుమణిగిన ఈ వివాదం భవిష్యత్​లో ఎలాంటి మలుపుతిరుగుతుందో..   

హైదరాబాద్​ అనగానే ఇన్నాళ్లూ చార్​మినార్​ గుర్తొచ్చేది. ఇప్పుడు జనం నోళ్లలో ఎర్రమంజిల్​ నానుతోంది. ఫక్రూల్​ ముల్క్​ బహదూర్​ అనే నవాబు హైదరాబాద్​లోని సోమాజిగూడలో చిన్న ఎత్తైన కొండపై పెద్ద ప్యాలెస్​ కట్టించాడు. అదే ‘ఎర్రమంజిల్​ ప్యాలెస్’​గా నిజాం కాలంలో ఫేమస్​ అయింది. ఈ ప్యాలెస్​ విస్తీర్ణం అప్పట్లోనే 400 ఎకరాలు. దాని చుట్టూ నిర్మించిన ప్రహారీనే కొన్ని మైళ్ల దూరం ఉండేది. ఈ ప్రాంగణంలో రెండు పెద్ద పోలో గ్రౌండ్​లు, టెన్నిస్​ కోర్టులు, పిక్నిక్​ గ్రౌండ్​లు, విశాలమైన తోటలు ఉండేవి. ఈ విశాలమైన భవనంలో 600 గదు​లు, డ్రాయింగ్​ రూమ్​లు, బ్యాంకెట్​ హాల్, బిలియార్డ్​ గదులు, కార్డ్​ రూమ్​లు ఉండేవి.

ఎర్రమంజిల్​ అంటే..

ఎర్రమంజిల్ అసలు పేను ఇరాం మంజిల్​. ఇది పర్షియన్​ పదం. తెలుగులో ‘స్వర్గంలో నిర్మించుకున్న అందాల భవనం’గా చెప్పొచ్చు.  పాయిగా నవాబు వికార్​ ఉల్​ ఉమ్రా కట్టించుకున్న ‘ఫలక్​నుమా ప్యాలెస్​’కు ధీటుగా ఉండాలని ఫక్రూల్​ ముల్క్​ బహదూర్​ భావించాడు. ఇండో–యూరోపియన్​ స్టయిల్​లో రెండతస్తుల అందాల సౌధంగా మలిచారు. ఇందులో 300 గుర్రాలు, 200కు పైగా పశువులు కట్టేసి ఉంచటానికి సరిపోయే వసతులు ఉండేవి. ప్యాలెస్​ లోపలి భాగం అందమైన కళాకృతులతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.

ఆ రోజుల్లోనే రూ.35 కోట్ల ఖర్చు

ఎర్రమంజిల్​ ప్యాలెస్​లో ప్రత్యేక ఆకర్షణ విశాలమైన డ్రాయింగ్​ రూమ్​.​ ప్యాలెస్​ నిర్మాణానికి ఆ రోజుల్లోనే దాదాపు రూ.35 కోట్లు ఖర్చయినట్లు చరిత్ర చెబుతోంది. ఏడో నిజాం పాలనలో ఘనమైన వైభవం చూసిన ఎర్రమంజిల్​ ప్యాలెస్​.. 1948లో పోలీస్​ చర్య జరిగే వరకు నవాబ్​ ఫక్రూల్​ ముల్క్​ సంబంధీకుల అధీనంలోనే ఉంది. 1950ల తర్వాత తొలుత స్టేట్​ ఆర్కైవ్స్​కు, అనంతరం పబ్లిక్​ వర్క్స్​ డిపార్ట్​మెంట్​కు అప్పగించారు. అప్పటి నుంచి ఇరిగేషన్​, ఆర్ అండ్​ బీ శాఖలు ఎర్రమంజిల్​ భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

సర్కారు ఏమంటోంది?

హెరిటేజ్​ ప్రాంతాల లిస్టు ఉన్న హైదరాబాద్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హుడా) జోనింగ్​ చట్టంలోని రెగ్యులేషన్​–13 తొలగింపుతో ఎర్రమంజిల్​ భవనం వారసత్వ హోదాను కోల్పోయింది. జీహెచ్​ఎంసీ పరిధిని వదిలేసి ఓఆర్​ఆర్​ బయటి ప్రాంతాల కోసం 2031 మాస్టర్​ ప్లాన్​ను​ తయారుచేశాం. ఈ క్రమంలో జీవో నంబర్​–183 ద్వారా హెరిటేజ్​ సైట్ల లిస్టు ఉన్న నిబంధన–13 తొలగించాం. ఎర్రమంజిల్​ భవనం హెరిటేజ్​ బిల్డింగ్​ కాదు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరింది.

హైకోర్టు అభిప్రాయం

రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అంశాలకు, మాస్టర్​ ప్లాన్ల​కు మధ్య తేడాలు ఉన్నాయి. 2010 నుంచి 2013 వరకు ఐదు మాస్టర్​ ప్లాన్లు వచ్చాయని గవర్నమెంట్​ చెబుతోంది. ఫస్ట్​ మాస్టర్​ ప్లాన్​లో హెరిటేజ్​ భవనాల రక్షణ గురించి ఉంది. రెండో మాస్టర్​ ప్లాన్​లో లేదు. ప్రభుత్వమేమో అన్ని మాస్టర్​ ప్లాన్లకూ సంబంధం ఉంటుందని అంటోంది. ప్రస్తుతం ఏ మాస్టర్​ ప్లాన్​ అమల్లో ఉందో సర్కారు క్లియర్​గా చెప్పాలి. 2010 నాటి హెచ్​ఎండీఏ మాస్టర్​ ప్లాన్​–ఏలో ఎర్రమంజిల్​ పురాతన కట్టడమే.

–పృథ్వీ కుమార్​ చౌహాన్​