​ మాతా శిశు కేంద్రంలోపురిట్లోనే శిశువు మృతి

  • కరీంనగర్​ మాతా శిశు కేంద్రంలోపురిట్లోనే శిశువు మృతి
  • తల, వీపుపై  గాయలు గుర్తులు విరిగిన చేయి
  • డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపణ

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ సిటీలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పుట్టిన‌ కొద్ది గంటల్లోనే ఓ శిశువు చనిపోవడం కలకలం రేపింది. చేయి విరిగి ఉండడం, తల, వీపుపై గాయాల గుర్తులు కనిపించడంతో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మరణించాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. బంధువుల కథనం ప్రకారం..చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ శ్వేత డెలివరీ కోసం సోమవారం రాత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ అయింది. రాత్రి నొప్పులు రావడంతో డాక్టర్లు నార్మల్ డెలివరీ చేశారు. అర్ధరాత్రి సమయంలో మగ శిశువు పుట్టినట్లు బంధువులకు చెప్పారు. డెలివరీ తర్వాత పరీక్షించిన డాక్టర్లు శిశువుకు శ్వాసకు సంబంధించి ఇబ్బంది ఉందని ఎమర్జెన్సీ వార్డులో చేర్చి ఆక్సిజన్ పెట్టారు. 

మంగళవారం ఉదయం సీరియస్ గా ఉందని, మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం వేరే హాస్పిటల్​కు షిఫ్ట్ చేయాలని సూచించారు. ఈ క్రమంలో వారు శిశువును పరీక్షించగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. దీంతో మృతికి డాక్టర్ల  నిర్లక్ష్యమే కారణమని శ్వేత భర్త, బంధువులు ఆందోళనకు దిగారు.  చేయి విరిగి ఉండడం, మెడ, తలకు అయిన గాయాలకు కారణాలు చెప్పాలని పట్టుబట్టారు. బాధ్యులైన డాక్టర్లను సస్పెండ్ చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్వేత భర్త రాజు ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

డాక్లర్ల నిర్లక్ష్యం లేదు : ఆర్ఎంఓ జ్యోతి 

ఘటనపై ఆర్‌ఎంఓ డాక్టర్ జ్యోతిని వివరణ కోరగా..డెలీవరీ కోసం వచ్చిన శ్వేతకు 230 వరకు షుగర్ ఉందన్నారు. నార్మల్ డెలీవరీ చేసేప్పుడు మొదట శిశువు తల బయటికి వచ్చిందని, ఆ తర్వాత చేయి ఇరుక్కుపోవడంతో లాగడం వల్ల విరిగిందన్నారు. కనిపించిన గాయాలు కూడా బయటికి తీస్తున్న క్రమంలో అయినవేనని తెలిపారు. డెలివరీ చేసిన డాక్టర్ కు 21 ఏళ్ల అనుభవం ఉందని , డాక్టర్ల నిర్లక్ష్యం లేదన్నారు.