(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : ఐపీఎల్ వస్తుందంటే అందరి కండ్లు స్టార్లపైనే ఉంటాయి. తమ ఫేవరెట్ బ్యాటర్లు దంచికొడుతుంటే.. బౌలర్లు వికెట్లు పడగొడుతుంటే ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటారు. అయితే, ఈ మెగా లీగ్ ప్రతీ ఏడాది కొత్త స్టార్లను అందిస్తుంది. పెద్దగా పేరు లేకుండా బరిలోకి దిగే ప్లేయర్లు తమ ఆటతో హీరోలుగా మారిపోతుంటారు. ఈసారి లీగ్‌లో అరంగేట్రం చేస్తున్న కొందరిలో ఈ జాబితాలో చేరే వాళ్లున్నారు. మెగా లీగ్‌లో తొలిసారే బరిలోకి దిగుతున్నప్పటికీ ప్రత్యర్థి జట్లు వారిపై కన్నేశాయి. ఫ్యాన్స్ సైతం వారి ఆట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లపై ఓ లుక్కేద్దాం..
రచిన్ రవీంద్ర (సీఎస్కే)
ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన హీరోల్లో 24 ఏండ్ల రచిన్ రవీంద్ర ఒకడు. ఓ వరల్డ్ కప్‌లో కివీస్ తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కిన రచిన్‌ను వేలంలో సీఎస్కే కేవలం రూ.1.8 కోట్లకే సొంతం చేసుకుంది. టీ20ల్లో తను ఇంకా టాలెంట్‌ను నిరూపించుకోలేదు. అయితే బ్యాకప్ ఓపెనర్ లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా పనికొస్తాడని భావించి చెన్నై అతడిని కొనుగోలు చేసింది. కానీ, కివీస్ బ్యాటర్ కాన్వే బొటన వేలుకు గాయం అవ్వడంతో సీఎస్కే టాపార్డర్‌లో రవీంద్రకు తలుపులు తెరిచినట్టయింది. కాన్వే మాదిరిగా పవర్ హిట్టర్ కాకపోయినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు టాపార్డర్‌లో టాలెంట్ చూపెట్టగల సమర్థుడు. లెఫ్టార్మ్ ఆఫ్ స్పిన్నర్‌గా కూడా పని కొస్తాడు. ఇది చెన్నై స్పిన్ వికెట్లపై సీఎస్కే బౌలింగ్ ఎటాక్‌కు అదనపు బలం చేకూర్చనుంది.
సమీర్ రిజ్వీ (సీఎస్కే)
వేలంలో సీఎస్కే అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై పెద్ద మొత్తం ఖర్చు చేసింది లేదు. కానీ, స్పిన్నర్ల బౌలింగ్‌లో విరుచుకుపడే 20 ఏండ్ల అన్‌క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్ సమీర్ రిజ్వీపై ఈసారి అనూహ్యంగా రూ. 8.40 కోట్లు కుమ్మరించింది. కారణం స్లో వికెట్లపై రిజ్వీకి భారీ షాట్లు కొట్టే సత్తా ఉండటమే. డెహ్రాడూన్‌లో స్లో వికెట్‌పై జరిగిన ముస్తాక్ అలీ టీ20 మ్యాచ్‌లో తమిళనాడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌ను దంచికొట్టి రిజ్వీ ఫేమస్ అయ్యాడు. యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్ స్టార్స్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టడంతో వేలానికి ముందుగానే ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిజ్వీపై కన్నేశాయి. గత నెలలో జరిగిన అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీతో మెరిసిన రిజ్వీ సీఎస్కేలో అంబటి రాయుడు స్థానాన్ని భర్తీ చేసే చాన్సుంది.
గెరాల్డ్ కోయెట్జీ (ముంబై ఇండియన్స్)
గతంలో రాజస్థాన్ రాయల్స్‌లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఉన్న సౌతాఫ్రికాకు చెందిన పేసర్ గెరాల్డ్ కోయెట్జీ ఈ సీజన్‌లో హిట్టర్ టిమ్ డేవిడ్‌తో పాటు ముంబై ఫస్ట్- చాయిస్ ఫారిన్ ప్లేయర్లలో ఒకడిగా కనిపిస్తున్నాడు. 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే కోయెట్జీ గత వన్డే వరల్డ్ కప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. స్పీడ్‌తో పాటు వేరియేషన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాట్‌తో కూడా రాణించే టాలెంట్ కోయెట్జీ సొంతం. 2023 ఎస్‌ఏ టీ20 టోర్నీలో జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు ఓ నాకౌట్ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్‌గా దింపింది.
నువాన్ తుషార (ముంబై ఇండియన్స్)
డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్‌తో శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు చాన్నాళ్ల పాటు ప్రధాన బౌలర్‌గా సేవలందించాడు. ఇప్పుడు మలింగను పోలిన బౌలింగ్ యాక్షన్‌తో ముంబై తరఫున ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వడానికి లంకకు చెందిన పేసర్ నువాన్ తుషార రెడీ అయ్యాడు. 29 ఏండ్ల నువాన్ ఎల్‌పీఎల్, పీఎస్‌ఎల్ లో సత్తా చాట్టాడు. ఇటీవల ఎస్‌ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టు తరఫున పోటీ పడ్డాడు. ఇప్పుడు ముంబై ప్రధాన జట్టులోకి వచ్చాడు. ఈ నెలలో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు పడగొట్టిన తుషార ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో పేరు తెచ్చుకున్నాడు.
అజ్మతుల్లా ఒమర్‌జామ్ (గుజరాత్ టైటాన్స్)
గుజరాత్ టైటాన్స్ తమ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలు కోల్పోయింది. అయితే, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ అతనికి సరైన రీప్లేస్‌మెంట్‌గా కనిపిస్తున్నాడు. 23 ఏండ్ల ఒమర్‌జాయ్ బ్యాట్‌తో దంచికొడుతూ.. పవర్ ప్లేలో కొత్త బంతిని స్వింగ్ చేయగలడు. వన్డే వరల్డ్ కప్‌లో అతని ఆట ఇండియా లెజెండ్ సచిన్‌ను ఇంప్రెస్ చేసింది. మెగా టోర్నీలో వార్నర్‌ను ఇన్ స్వింగర్‌తో అవుట్ చేసిన వెంటనే తర్వాతి బంతిని ఔట్ స్వింగర్‌తో ఇంగ్లిస్ పని పట్టి ఆసీస్‌పై అఫ్గాన్‌ను గెలిపించినంత పని చేశాడు. ఈ మధ్యే శ్రీలంకతో వన్డేలో కెరీర్ బెస్ట్ (149*) ఇన్నింగ్స్ ఆడి బ్యాట్‌తోనూ మంచి ఫామ్‌లో ఉన్నాడు.
స్పెన్సర్ జాన్సన్ (గుజరాత్ టైటాన్స్)
రెండేండ్ల కిందట గాయంతో ఆటకు దూరమై, అవకాశాలు లేక కొన్నాళ్లు తోటమాలిగా (ల్యాండ్‌స్కేప్ గార్డెనర్) పని చేసిన ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ స్పెన్సర్ జాన్సన్ ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్ సెన్సేషన్. బీబీఎల్‌తో పాటు ది హండ్రెడ్, ఎంఎల్‌సీ , గ్లోబల్ టీ20 కెనడా వంటి లీగ్స్‌లో సత్తా చాటిన 28 ఏండ్ల స్పెన్సర్ షార్ట్ ఫార్మాట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా మారాడు. దాంతో, పలు ప్రాంచైజీలతో పోటీలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ. 10 కోట్ల భారీ రేటుతో కొనుగోలు చేసింది. 6.4 అడుగుల ఎత్తున్న జాన్సన్ 140 కి.మీ వేగంతో సంధించే యాంగిల్ బాల్స్, ఎక్స్‌ట్రా బౌన్స్ బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాయి. గాయంతో షమీ ఈ సీజన్‌కు దూరమైన నేపథ్యంలో స్పెన్సర్‌ను టైటాన్స్ ప్రధాన బౌలర్‌గా బరిలోకి దింపే చాన్సుంది.
కుమార్ కుశాగ్ర (ఢిల్లీ క్యాపిటల్స్)
జార్ఖండ్‌కు చెందిన వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర కోసం సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య వేలంలోబిడ్డింగ్ వార్ నడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరికి క్యాపిటల్స్ రూ. 7.20 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. రీఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్ బ్యాటర్‌గానే ఆడితే 19 ఏండ్ల కుశాగ్ర కీపర్‌గా బరిలోకి దిగే చాన్సుంది. అతను ఫినిషర్‌గానూ పనికొస్తాడు. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో ఆరో నంబర్‌లో వచ్చి 37 బాల్స్‌లోనే 67 రన్స్ కొట్టిన కుశాగ్ర మహారాష్ట్ర ఇచ్చిన 355 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసి జార్ఖండ్‌ను గెలిపించాడు.