నిర్మల్​ కొయ్య బొమ్మలకు కొత్తందాలు

నిర్మల్​ కొయ్య బొమ్మలకు కొత్తందాలు
  • అంతర్జాతీయ స్థాయిలో తయారీకి  కేంద్ర ప్రభుత్వ సహకారం
  • ‘గురు శిష్య హస్త శిల్ప ప్రశిక్షన్’ లో 
  • నిర్మల్​కొయ్య బొమ్మల కేంద్రం ఎంపిక  
  •  యువ కళాకారులను ప్రోత్సహించనున్న జౌళీ శాఖ 

నిర్మల్, వెలుగు : నిర్మల్ కొయ్య బొమ్మలు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు తయారు చేస్తున్న విధానానికి కొత్త మెరుగులు దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్మల్ కొయ్య బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్​నేషనల్​ మార్కెట్​లో ఈ బొమ్మ లకు ఆశించిన డిమాండ్ ఉన్నప్పటికీ సంప్రదాయ రీతిలో ఉన్న మోడల్స్ కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. బొమ్మల తయారీ కోసం ఉపయోగించే ముడి సరుకు ధరలు, ఇతర ఖర్చులు అధికం కావడంతో బొమ్మల ధరలు భారీగా పెరిగాయి. దీంతో రాను రాను గిరాకీ తగ్గుతోంది. ఈ క్రమంలో చేతివృత్తులను ప్రోత్సహించేందుకు కొద్దిరోజుల క్రితం కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థ నడుం బిగించింది. మార్కెట్​లో డిమాండ్ కు అనుగుణంగా నిర్మల్ కొయ్య బొమ్మలకు కొత్త అందాలు తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన గురు శిష్య హస్త శిల్ప ప్రశిక్షణ కార్యక్రమం కింద నిర్మల్ కొయ్య బొమ్మల కేంద్రాన్ని ఎంపిక చేసింది.  

రాష్ట్రంలో నిర్మల్ కే అవకాశం

గురు శిష్య హస్త శిల్ప ప్రశిక్షణకు ఏపీలోని తిరుపతిలో ఉన్న లక్ష్మీగారిపల్లె, విశాఖ జిల్లాలోని ఏటికొప్పాకలను ఎంపిక చేయగా, మన రాష్ట్రం నుంచి కేవలం నిర్మల్ నే ఎంపిక చేశారు. ఈ పథకంలో భాగంగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువ కళాకారులకు ప్రాధాన్యతనిస్తున్నారు. వీరందరినీ దశల వారీగా ఎంపిక చేసి మూడు నెలల పాటు నిర్మల్ లోనే శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి దశలో భాగంగా 20 మందిని ట్రైనింగ్​కోసం ఎంపిక చేసి అంతర్జాతీయ స్థాయి శిక్షణ​ఇస్తున్నారు. వీరికి ప్రతిరోజు రూ.300 పారితోషకంతో పాటు టూల్స్, రా మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక ఆర్టిజన్ ఐడీ కార్డులను అందజేస్తారు. ఈ కార్డుతో దేశ, విదేశాల్లో నిర్వహించే ట్రేడ్ ఫేర్ లలో కొయ్య బొమ్మల ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొయ్య బొమ్మల విక్రయాలకు కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్​పోర్ట్​ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థ చర్యలు తీసుకుంటుంది.  

కళాకారులకు ఉపాధి పెంపొందించేందుకే..

యువ కళాకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో గురు శిష్య హస్త శిల్ప ప్రశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికోసం నిర్మల్ జిల్లాలోని కొయ్యబొమ్మల కేంద్రాన్ని ఎంపిక చేశాం. 20 మంది చొప్పున యువ కళాకారులకు 3 నెలల పాటు శిక్షణ ఇస్తాం. వీరికి ప్రతిరోజు రూ.300 ఇస్తాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ కు అనుగుణంగా బొమ్మలను తయారు చేయిస్తాం. మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తాం. ఈపీపీహెచ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్​కుమార్ సహకారంతో దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్​ చేపట్టనున్నాం.

- నాగ తులసీరావు, 
  సదరన్ స్టేట్స్ డైరెక్టర్, ఈపీసీహెచ్​ 

మార్కెట్ విస్తరణకు తోడ్పడుతుంది

ఈ శిక్షణ కొయ్య బొమ్మల కళాకారులకు ఉపయోగపడుతుంది. బొమ్మల మార్కెట్ విస్తరణకు దారులు చూపెడుతుంది. ఇప్పుడున్న కళాకారులు ఆధునిక మోడల్స్ పై అవగాహన పెంచుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కనుగుణంగా బొమ్మలను తయారు చేయవచ్చు. కేంద్రం చేపట్టిన ఈ పథకం కళాకారుల  జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది.

-  పెంటయ్య, 
    కొయ్య బొమ్మల కళాకారుడు, నిర్మల్

గర్వకారణం

గురు శిష్య హస్త శిల్ప ప్రశిక్షణ కార్యక్రమం కింద నిర్మల్ కొయ్య బొమ్మల కేంద్రాన్ని ఎంపిక చేయడం గర్వకారణం. చాలా ఏండ్లుగా సంప్రదాయ రీతిలోనే బొమ్మలు తయారు చేస్తున్నాం. కొత్త మోడల్స్ పై అవగాహన లేక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో సహకారం లభించడం లేదు. హస్త కళల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ సహకారంతో ఆ సమస్య తీరుతుంది. శిక్షణ తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అనుకుంటున్నా.   

- నాంపల్లి రాజశేఖర్, కొయ్య బొమ్మల కళాకారుడు, నిర్మల్