- మూడో సారి ఆడపిల్ల పుట్టిందని అమ్ముకున్న తండ్రి
- అదనంగా టూవీలర్ కూడా తీసుకున్నడు
- తల్లి అడిగితే చనిపోయిందని నమ్మించే యత్నం
- ఎట్టకేలకు బయటపడ్డ విషయం
ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారంలో మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని, ఐదు రోజుల పసిగుడ్డును తండ్రి రూ.15 వేలకు అమ్మాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేలు గ్రామానికి చెందిన జంపయ్య తన భార్య లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో జూన్1న ఏటూరునాగారంలోని సామాజిక దవాఖానకు తీసుకువచ్చాడు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలుండగా మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టింది.
దీంతో తాను ఆ బిడ్డను సాకలేనని దవాఖాన సమీపంలో కనపడిన వారందరికీ పాపను అమ్ముతానని చెప్పాడు. మండలంలోని రామన్నగూడానికి చెందిన దంపతులు రూ.15 వేలు, పాత టీవీఎస్ ఎక్సెల్ వాహనం ఇచ్చి పాపను తీసుకున్నారు. పాప ఏదని తల్లి అడిగితే అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి స్వగ్రామానికి తీసుకువెళ్లాడు. అయితే, భర్తపై అనుమానం వచ్చిన భార్య నిలదీయగా అసలు విషయం చెప్పాడు.
దీంతో రెండు నెలల తర్వాత తన పాపను తనకు ఇప్పించాలని మంగళవారం ఏటూరునాగారం పోలీసులను తల్లి ఆశ్రయించింది. అయితే, మూడు నెలలుగా పాపను పెంచుకుంటున్న దంపతులు తాము అల్లారుముద్దుగా చూసుకుంటున్నామని, ఇవ్వలేమని వాదిస్తున్నారు. పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇచ్చారు. వారి సలహాలు, సూచనలతో కేసు పరిష్కరిస్తామని పోలీసులు చెప్పారు.