- మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లిలో విషాదం
హన్వాడ,వెలుగు: కొడుకు లేని లోటు తీరిందనే ఆనందం ఆ కుటుంబంలో కొద్ది సేపటికే ఆవిరైంది. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ వెంటనే చనిపోగా, పురుడు పోసుకున్న తల్లి బీపీ ఎక్కువై మరణించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన మున్నూరు రాజు, శిరీష దంపతులు ఇద్దరు కూతుళ్లతో కలిసి హైదరాబాద్ లోని అంబర్ పేటలో కూలీ పని చేసుకుంటూ బతుకున్నారు.
మంగళవారం శిరీషకు పురిటి నొప్పులు రావడంతో కోటి మెటర్నటీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 7వ నెలలో డెలివరీ కావడం, శిశువు ఉమ్మనీరు మింగడంతో పుట్టిన కొద్ది సేపటికే మగ శిశువు చనిపోయాడు. తల్లి శిరీష(25)కు బీపీ ఎక్కువ కావడం, తెల్ల రక్త కణాలు తక్కువ కావడంతో ఆమెను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం శిరీష చనిపోయింది. ఉదయం బాబు, సాయంత్రం తల్లి చనిపోవడంతో పెద్దదర్పల్లి గ్రామంలో విషాదం నెలకొంది.