గర్భిణీ పట్ల డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..

నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం వహించటంతో  శిశువు మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన చెరుకుపల్లి శ్రీలత డెలివరీ కోసం జిల్లా ఆస్పత్రితో చేరింది. అయితే, హాస్పిటల్లో డాక్టర్లు  పట్టించుకోకపోవడంతో.. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు శ్రీలతను బయటకు తీసుకెళ్తుండగా.. వారిని ఆస్పత్రి సిబ్బంది అడ్డుకున్నారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీలతను... సిబ్బంది ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. డెలివరీ టైంలో శిశువు మృతి చెందింది. హాస్పిటల్ సిబ్బంది తీరుతోనే శిశువు చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. 

మరోవైపు గత గురువారం రాత్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో  ఓ గర్భిణి కుర్చీలోనే  డెలివరీ అయింది. ఈ ఘటన మరవక ముందే ఇవాళ శిశువు మృతి చెందడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం తీరుపై మండిపడుతున్నారు.  బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.