-
మీరు ఆలోచిస్తే.. ఇది పనిచేసి పెడుతుంది!
-
కొత్త బ్రెయిన్ ఇంప్లాంట్‌ను తయారు చేసిన సైంటిస్టులు
-
మనిషి ఆలోచనలను అర్థం చేస్కున్న ఇంప్లాంట్
-
దాని ఆదేశాలతో పనులు చేసి పెట్టిన అమెజాన్ అలెక్సా
న్యూయార్క్: మనిషి కూర్చున్న చోటి నుంచే జస్ట్ ఆర్డర్ వేస్తే చాలు.. మ్యూజిక్ వినిపించడం, టీవీ ఆన్ చేయడం, లైట్లు, ఫ్యాన్లు వేయడం, ఆపేయడం దగ్గర నుంచి ఇంట్లో దాదాపు అన్ని పనులూ చేసి పెట్టే అమెజాన్ అలెక్సా వంటి స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. కానీ వీటన్నింటికీ నోటి మాట ద్వారానో లేదంటే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో క్లిక్ చేయడం ద్వారానో మాత్రమే ఆదేశాలు ఇవ్వగలం. మరి పక్షవాతంతోపాటు ఇతర అనారోగ్యాల వల్ల వీల్ చైర్ కే పరిమితమైపోయి కనీసం మాట్లాడలేని, శరీరాన్ని కదిలించలేని వ్యక్తుల మాటేమిటి? ఇకపై ఇలాంటి వారు కూడా డిజిటల్ అసిస్టెంట్లను ఈజీగా వినియోగించవచ్చని, జస్ట్ వారు మెదడులో ఆలోచిస్తే చాలు.. ఆ ఆలోచనలను అర్థం చేసుకుని డిజిటల్ అసిస్టెంట్లు పని చేసేలా చేయొచ్చని అమెరికాలోని ‘సింక్రన్’ అనే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ కంపెనీ చెప్తోంది. తాము తయారు చేసిన బ్రెయిన్ ఇంప్లాంట్‌ను కండరాల బలహీనత, పక్షవాతానికి కారణమయ్యే అమయోట్రోఫిక్ లాటరల్ స్క్లిరోసిస్ వ్యాధి బారిన పడిన మార్క్ అనే 64 ఏండ్ల వృద్ధుడి మెదడులోని రక్తనాళంపై అమర్చి చూడగా, అది సక్సెస్ ఫుల్‌గా పనిచేసిందని ఆ కంపెనీ సోమవారం ప్రకటించింది.
ఇలా ఆలోచిస్తే.. అలా పనులైనయ్..
మార్క్ ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ ఇంప్లాంట్ అమెజాన్ ఫైర్ ట్యాబ్లెట్ లో ఐకాన్ లను క్లిక్ చేసిందని, తద్వారా అమెజాన్ అలెక్సాకు ఆదేశాలు అంది అది కోరుకున్న పనులను చేసి పెట్టిందని వెల్లడించింది. మార్క్ ఆలోచనల మేరకు వీడియో కాల్స్ చేయడం, మ్యూజిక్ వినిపించడం, వీడియోలు చూపించడం, స్మార్ట్ లైట్లు, ఫ్యాన్ల వంటివి ఆన్, ఆఫ్ చేయడం, ఆన్ లైన్ లో షాపింగ్ చేయడం, బుక్స్ చదివి వినిపించడం వంటివి బ్రెయిన్ ఇంప్లాంట్ ఆదేశాలతో అలెక్సా చేసి పెట్టిందని ఆ కంపెనీ వివరించింది. ‘‘ఈ ఇంప్లాంట్‌తో నేను కోల్పోయిన స్వతంత్రతను మళ్లీ పొందినట్టు అనిపించింది. నా చుట్టూ నాకు కావాల్సిన పనులను మేనేజ్ చేసుకోగలగడం, కోరుకున్నట్టు వినోదం పొందగలగడం చాలా బాగుంది” అని మార్క్ సంతోషం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కాగా, బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌తో పాటు పలు కంపెనీలు కూడా ఇలాంటి బ్రెయిన్ ఇంప్లాంట్లను తయారు చేస్తున్నాయి.