తెలంగాణలోకి కొత్త బ్రాండ్ బీర్లు, లిక్కర్.. సీఎం రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్​

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ బీర్లు, లిక్కర్.. సీఎం రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్​
  • కొత్త కంపెనీల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశాలు
  • కమిటీ సిఫార్సుల ఆధారంగానే మద్యం ధరల పెంపు
  • కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించేది లేదన్న సీఎం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్ల బీర్లు, లిక్కర్ రానున్నాయి. ఇందుకోసం కొత్త లిక్కర్, బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి అప్లికేషన్లు స్వీకరించేందుకు  నోటిఫికేషన్ జారీ చేయాలని, నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లిక్కర్​తయారీలో కొన్ని కంపెనీల గుత్యాధిపత్యాన్ని, ప్రభుత్వాన్ని బ్లాక్​మెయిల్​చేసే విధానాలను సహించేది లేదన్నారు.

 బీర్ల ధరల పెంపునకు అనుమతించట్లేదని, పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ ఇటీవల తెలంగాణ బేవరేజేస్ కార్పొరేషన్​కు బీర్ల సరఫరా నిలిపివేసింది.

 దీంతో కింగ్‌‌ఫిషర్ సహా ఏడు బ్రాండ్ల బీర్లు బయటకు రాక గోడౌన్లలోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్​లో ఎక్సైజ్ ఆఫీసర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష  నిర్వహించారు.

 కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం, బ్లాక్​మెయిలింగ్ గురించి తెలుసుకున్న సీఎం.. రాష్ట్రంలో లిక్కర్, బీర్ల తయారీకి, సరఫరాకు ముందుకు వచ్చే కొత్త కంపెనీలను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలన్నారు. 

ఇప్పటికే టీజీబీసీఎల్​కు సరఫరా చేస్తున్న కంపెనీలు.. కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సైతం సులభతర వాణిజ్య విధానం పాటించాలన్నారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లను తీసుకునేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల గడువు ఇవ్వాలని సూచించారు. 

ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, నాణ్యత, సరఫరా సామర్థ్యం పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. 

కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపు.. 

యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఇటీవల ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి  తీసుకు వచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేదిలేదని పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీర్ల ధరలను పరిశీలించాలని సీఎం సూచించారు. 

హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణాయక కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) ఇచ్చే నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు బిల్లులు చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు. 

గత ప్రభుత్వం పెండింగ్​పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ సీఎస్  రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పాల్గొన్నారు.  

గతేడాది అనుమతులు ఇచ్చి, వెనక్కి..

తెలంగాణ ఎక్సైజ్​శాఖ, తెలంగాణ బేవరేజేస్ కార్పొరేషన్ గతేడాది కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతించినా, విమర్శలు రావడంతో వెంటనే వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు కంపెనీలకు ప్రత్యేక విధానంలో పర్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. 

గతంలో అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో టాయిట్‌‌ బ్రూవరీస్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌, ఎక్సోటికా లిక్కర్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌, మౌంట్‌‌ ఎవరెస్ట్ లిమిటెడ్‌‌, లీలాసన్స్‌‌ ఆల్కా బేవ్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌, సోం డిస్టిలరీస్‌‌ అండ్‌‌ బేవరేజెస్‌‌ ఉన్నాయి. 

ఇందులో సోమ్ డిస్టిలరీస్‌‌ నుంచి పవర్1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పికర్ బీర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం యునైటెడ్ బ్రూవరీస్​నుంచే దాదాపు 70 శాతం బీర్లు రాష్ట్రవ్యాప్తంగా సప్లై అవుతున్నాయి. 

తాజా పరిణామాల నేపథ్యంలో సంక్రాంతి పండగ తర్వాత కింగ్ ఫిషర్ బీర్లతోపాటు మరికొన్ని కంపెనీల బీర్లు ఇక దొరికే అవకాశం తక్కువే. కింగ్​ఫిషర్ బీర్లు రావడం లేదనే వార్త తెలియడంతో ఇప్పటికే కొంత మంది వైన్స్ యాజమానులు వాటిని బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.