చదువుకోనివ్వకుండా పెండ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య

  •     డిగ్రీ పూర్తయ్యాక పెండ్లి 
  •     తట్టుకోలేక సూసైడ్


చండ్రుగొండ, వెలుగు : ఉన్నత చదువులు చదువుకొని మంచిగా సెటిల్​అవ్వాలన్న ఆశయం ఉన్నా  కుటుంబ సభ్యులు బలవంతంగా పెండ్లి చేశారని ఓ  నవ వధువు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల  కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని మంగయ్యబంజరు గ్రామానికి చెందిన భూక్యా శ్రీను, పద్మ దంపతుల బిడ్డ దేవకి (23) డిగ్రీ పూర్తి చేసింది. 

పైచదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని అనుకుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం గత నెల 28న చండ్రుగొండ మండలంలోని దుబ్బతండాకు చెందిన  గుగులోతు బాలరాజుకు ఇచ్చి పెండ్లి చేశారు. ఈ నెల 12న నూతన దంపతులను మంగయ్యబంజరుకు తీసుకొచ్చారు. 13 వతేదీ రాత్రి 12 గంటల సమయంలో దేవకి ఇంట్లో పురుగుమందు తాగింది. 

దేవకి వాంతులు చేసుకోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు జూలూరుపాడు దవాఖానకు అక్కడి నుంచి కొత్తగూడెం, తర్వాత ఖమ్మం కిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. తహసీల్దార్​సంధ్యారాణి, ఎస్సై రవి ఆదివారం ఖమ్మం హాస్పటల్‌కు వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
మంగపేట మండలం కమలాపురంలో...

ఏటూరునాగారం/మంగపేట, వెలుగు : పెండ్లయిన పంతొమ్మిది రోజులకే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన నిమ్మల ఏడుకొండలు, పద్మా దంపతుల రెండో కూతురు కోమలిక (20)కు ఏటూరునాగారం మండలం రాంనగర్‌ గ్రామానికి చెందిన నూకల సత్యనారాయణ, సమ్మక్క కొడుకు గోవిందతో ఈ నెల 4న పెండ్లి జరిగింది. తర్వాత వారం రోజుల నుంచే గోవింద, కోమిలక మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో కోమలిక నాలుగు రోజుల క్రితం కమలాపురంలోని పుట్టింటికి వెళ్లింది. 

ఆదివారం గోవింద కూడా కమలాపురం వచ్చాడు. కుటుంబ సభ్యులంతా బంధువుల పెండ్లికి వెళ్లడంతో కోమలిక, గోవింద ఇద్దరే ఉన్నారు. వీరిద్దరి మధ్య సోమవారం మరోసారి గొడవ జరగడంతో గోవింద రాంనగర్‌కు వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన కోమలిక బాత్‌రూంలోకి వెళ్లి పురుగుల మందు తాగింది. ఆమె పెద్దనాన్న కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్‌కు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండండతో వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయింది.