- వృథాగా వెటర్నరీ హాస్పిటల్ బిల్డింగ్‌లు
- రైతులు, సిబ్బందికి తప్పని ఇబ్బందులు
మెదక్, పాపన్నపేట, వెలుగు: పశువైద్య సేవలు మెరుగు పరచాలనే ఉద్దేశ్యంతో వెటర్నరీ ఆస్పత్రుల కోసం నిర్మించిన కొత్త బిల్డింగ్‌లు వృథాగా ఉంటున్నాయి. మెదక్ జిల్లాలో పెద్దదైన పాపన్న పేట మండలంలో ఏడాది కిందనే మూడు భవనాలు పూర్తయినా అధికారులు ఓపెన్ చేయడం లేదు. పాత బిల్డింగుల్లోనే అరకొర వసతుల మధ్య హాస్పిటల్స్ కొనసాగించాల్సి వస్తుండడంతో ఇటు రైతులు, అటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రూమ్స్ ఇప్పటికే శిథిలావస్థకు చేరడంతో మెడిసిన్స్, రికార్డులు పాడైపోతున్నాయని సిబ్బంది వాపోతున్నారు.
రూర్బన్ స్కీమ్ కింద ఎంపిక
శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద ఎంపికైన పాపన్నపేట మండలానికి రూ.30 కోట్లు మంజూరు కాగా వివిధ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో డెవలప్ మెంట్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. పాపన్నపేట మండలంలో అన్ని రకాల పశువులు కలిపి 70,171 (720 ఆవులు, 1,461 పాడి గేదెలు, 33, 427 గొర్రెలు, 33,778 మేకలు, 785 పందులు) ఉండడంతో పాపన్నపేట, ఎల్లాపూర్, కుర్తివాడ, నాగ్సాన్ పల్లి, పొడ్చన్ పల్లిలో వెటర్నరీ హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే ఈ బిల్డింగ్ లు దశాబ్దాల కింద నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరాయి. దీంతో కొత్త బిల్డింగ్‌లు నిర్మించేందుకు పాపన్నపేటకు రూ.35 లక్షలు, ఎల్లాపూర్ కు రూ.20 లక్షలు, కుర్తివాడ కు రూ.20 లక్షలు, నాగ్సన్ పల్లికి రూ.20 లక్షలు, పొడ్చన్ పల్లికి రూ.20 లక్షలు మంజూరు చేసి.. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.
ఏదాడి కిందే పనులు పూర్తి
కాంట్రాక్టర్లు పోడ్చన్ పల్లి మినహా మిగతా నాలుగు చోట్ల ఏడాది కిందనే పనులు పూర్తి చేశారు. కానీ, అధికారులు ఇప్పటివరకు వాటిని ప్రారంభించడం లేదు. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన బిల్డింగ్‌లు వృథాగా ఉంచడంపై రైతులు, సిబ్బంది మండిపడుతున్నారు. మెడిసిన్స్, రికార్డులు పాడవుతున్నాయని, అక్కడక్కడ పెచ్చులూడుతుండడంతో భయభయంగా పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెటర్నరీ హాస్పిటల్స్ బిల్డింగ్‌లను ఓపెన్ చేయాలని కోరుతున్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం
పాపన్నపేట మండలంలో 5 పశువైద్యశాలకు నాలుగు పూర్తి కాగా పొడ్చన్ పల్లిలో మాత్రం పనులు జరుగుతున్నాయి. పూర్తయిన పశువైద్యశాల బిల్డింగ్ లను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటం.
–గోపాల్, పంచాయతీరాజ్ ఏఈ, పాపన్నపేట