
- పొరపాట్లకు తావు లేకుండా భవనాల నిర్మాణం
- 31న సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
- ఏర్పాట్లపై రివ్యూ చేసిన హెల్త్ మినిస్టర్
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా దవాఖాన కొత్త భవనాల నిర్మాణంలో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో మంగళవారం ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లు, శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రి సమీక్ష చేశారు. గోషామహల్‌లో ఈ నెల 31న ఉస్మానియా నూతన భవన నిర్మాణాలకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని, కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
పేషెంట్లు, డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు, ఇతర స్టాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని వారికి కావాల్సిన అన్ని సదుపాయాలతో భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్‌లో ప్రజలకు అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తామన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. కాగా, ఉస్మానియా హాస్పిటల్ డిజైన్లపై ఈ నెల 25న సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేశారు. డిజైన్లను పరిశీలించి, పలు మార్పులు సూచించారు.
సీఎం సూచనల మేరకు భవన నమూనాల్లో ఆర్కిటెక్ట్ మార్పులు చేశారు. ఈ మార్పులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, సీఎం సెక్రటరీ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివ శంకర్ లోతేటి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ నరేంద్ర కుమార్, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ సహాయ్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.