కాకినాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబు.. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈక్రమంలో అధికారులు రంగంలోకి దిగారు. రాజ్యలక్ష్మీ నగర్‌లో వైసీపీ నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు.. వాటిని కూల్చివేస్తుండగా ఉద్రికత్త చోటుచేసుకుంది.
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, తన అనుచరుడు సూరిబాబుతోపాటు మరికొంతమందితో అక్కడికి వచ్చి కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని.. ద్వారంపూడి తన అనుచరులతో కలికసి గొడవకు దిగారని అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ద్వారంపూడి, ఆయన అనుచరుడు సూరిబాబుతోపాటు మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో ఏ1గా ద్వారంపూడి, ఏ2గా బళ్ల సూరిబాబు పేర్లను చేర్చారు.