హైదరాబాద్​లో కాగ్నిజెంట్​కొత్త సెంటర్

హైదరాబాద్​లో కాగ్నిజెంట్​కొత్త సెంటర్
  •     10 లక్షల స్క్వేర్​ ఫీట్ల విస్తీర్ణంలో​ ఏర్పాటు.. 15 వేల మందికి జాబ్స్​
  •     సీఎం రేవంత్​ అమెరికా టూర్​లో కుదిరిన ఒప్పందం
  •     కాగ్నిజెంట్​ కంపెనీకి తగిన మద్దతిస్తం
  •     సెంటర్​ ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం రేవంత్​రెడ్డి
  •     ప్రముఖ టెక్​ కంపెనీల చూపు హైదరాబాద్​ వైపు: మంత్రి శ్రీధర్​బాబు
  •     సెంటర్​ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది: కంపెనీ సీఈవో రవికుమార్​
  •     రాష్ట్రంలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్ పై కాగ్నిజెంట్​ ఫోకస్​

హైదరాబాద్, వెలుగు : ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో తన సేవలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చింది.  హైదరాబాద్​లో దాదాపు 15 వేల మందికి ఉపాధి కల్పించేలా కొత్త సెంటర్​ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఈ సెంటర్​ను స్థాపించనుంది.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్రంలో కాగ్నిజెంట్​ సెంటర్​ ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. 

టైర్​ 2 నగరాల్లోనూ విస్తరణ 

ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని ప్రకటించారు. 

కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని ఆయన  అన్నారు. హైదరాబాద్​తో పాటు తెలంగాణలోని ఇతర టైర్-2 నగరాల్లో కూడా ఐటీ సేవలను విస్తరించాలని సీఎం సూచించగా.. కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 

దావోస్​ పర్యటనలోనే పునాది

ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్​ బృందం దావోస్ పర్యటన సందర్భంగానే కాగ్నిజెంట్​తో ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అందుకే  కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్​ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ అండ్​ క్లౌడ్ సొల్యూషన్స్‌‌‌‌తో పాటు వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. 

సంతోషంగా ఉంది: కాగ్నిజెంట్ సీఈవో 

టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌‌‌‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు.  హైదరాబాద్ లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని, ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని ఆయన చెప్పారు.