- పీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గం గతంతో పోల్చితే ఈసారి తక్కువమందితో ఉంటుందని కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పార్టీపరంగా నాయకులకు గుర్తింపు ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో పీసీసీ పదవులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఆ అవసరం లేదన్నారు. అందుకే పీసీసీ కార్యవర్గాన్ని బాగా కుదిస్తామని చెప్పారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులతో పాటు అన్ని రకాల పోస్టులను తగ్గిస్తామన్నారు. సెప్టెంబర్ 17 ను గతేడాది ర్వహించినట్లే ఈ ఏడాది గాంధీ భవన్లో జరుపుతామన్నారు. పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం ఉంటుందన్నారు. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని, అందుకే పీసీసీ చీఫ్గా తనను నియమించారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ నెల 15 న పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. ఏఐసీసీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసేందుకే ఢిల్లీకి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.