
కామారెడ్డి, వెలుగు : శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్‌ను సగం కూల్చి వేసి మూడు ఏండ్ల క్రితం మన ఊరు–మన బడి కింద కొత్తగా క్లాస్ రూమ్‌ల నిర్మాణం చేపట్టారు. బిల్లు రాలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పనులను నిలిపివేశారు. అటు కొత్త బిల్డింగ్ పనులు పూర్తి కాకపోవడం.. ఇటు శిథిలమైన నాలుగు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. సరిపడా తరగతి గదులు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గర్ల్స్ హైస్కూల్ బిల్డింగ్ దశాబ్దాల క్రితం నిర్మించింది. గత ప్రభుత్వం 2022లో చేపట్టిన మన ఊరు–మన బడి కార్యక్రమంలో రూ. 50 లక్షలతో కొత్తగా క్లాస్ రూమ్ ల నిర్మాణం పనులు షూరు చేశారు. పాత బిల్డింగ్ సగం కూల్చి వేసి రెండున్నర ఏండ్ల క్రితం నూతన గదుల నిర్మాణం చేపట్టారు.
స్లాబ్‌లు వేసి వదిలేశారు. పనులకు సంబంధించి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ మిగతా పనులు ఆపేశాడు. ప్రస్తుతం పాత బిల్డింగ్‌లో 4 గదులు ఉన్నాయి. ఇవి కూడా పైకప్పు పెచ్చులూడటం, పగుళ్లు వచ్చాయి. 6 నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 103 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 4 గదుల్లోనే 5 క్లాస్‌లు, ఆఫీసు రూమ్, హెచ్ఎం రూమ్, స్టాఫ్ రూమ్ కొనసాగుతున్నాయి. కింద మట్టి, చుట్టూ గోడలు లేక పోవటంతో బాలికలు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.