- జిల్లా అభివృద్ధి కృషి చేస్తా.. ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు
- ‘వీ6వెలుగు’తో జగిత్యాల కొత్త కలెక్టర్సత్యప్రసాద్
జగిత్యాల, వెలుగు: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని జగిత్యాల నూతన కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. ఇటీవల బదిలీల్లో భాగంగా జగిత్యాల జిల్లాకు వచ్చిన ఆయన గురువారం స్థానిక జిల్లా హాస్పిటల్ ను సందర్శించారు. హాస్పిటల్ లోని సౌకర్యాలు, వసతులపై ఆరాతీశారు. రిజిష్టర్లు, రికార్డులు పరిశీలించారు. అనంతరం తన చాంబర్ లో ‘వీ6వెలుగు’ ప్రతినిధితో మాట్లాడారు.
విద్యా, వైద్యానికి ప్రాధాన్యం
జగిత్యాల జిల్లాలో విద్యా, వైద్యానికి ప్రాధాన్యమివ్వనున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వీటికోసం స్కూళ్లు, హాస్పిటల్ లో సౌకర్యాల కల్పనకు కృషి చేయనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగిసినా సర్కార్ బడుల్లో విద్యార్థుల చేరికకు చర్యలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.
స్కూళ్లలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. వర్షా కాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో చర్యలు తీసుకుంటామన్నారు. హాస్పిటళ్లలో సిబ్బంది, సౌకర్యాల కల్పనపై దృష్టి పెడతామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త, చెదారాన్ని ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. జిల్లాలోని ఇతర సమస్యలపై దృష్టి పెట్టి ప్రజలకు సత్వర పరిష్కారం, న్యాయం అందేలా చూస్తామన్నారు.
ధరణి సమస్యలను పరిష్కరిస్తాం
ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ధరణి సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేస్తామన్నారు. భూములకు సంబంధించి పొజిషన్ లో ఉన్న రైతులు, టైటిల్ పరిశీలన, ప్రభుత్వ ప్రాధాన్యత, న్యాయమైన వివాదాల వంటి అంశాలపై దృష్టి సారిస్తూ రిజెక్ట్ చేసిన అంశాలను కూడా స్పష్టంగా వివరిస్తామన్నారు.
గతంలో ఉమ్మడి జిల్లాలో పనిచేసిన అనుభవం తనకు పనికొస్తుందని, వివిధ అధికారులతో ఉన్న అనుబంధంతో పాలన పరమైన సమస్యలు అధిగమిస్తామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో జిల్లాను అన్నిరంగాల్లో ముందుండేలా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయ సాధనదిశగా జిల్లాలో పాలన కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.