కొత్త కలెక్టర్లు బిజీ.. బిజీ.. పాలనపై ఫోకస్​

కొత్త కలెక్టర్లు బిజీ.. బిజీ.. పాలనపై ఫోకస్​
  •     ఫీల్డ్​ లోకి వెళ్లి పనుల పరిశీలన
  •     అభివృద్ధి పనులపై సమీక్షలు
  •     డెడ్​లైన్​లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు

వెలుగు, నెట్​వర్క్​ : ఉమ్మడి జిల్లాలో ఇటీవల చార్జి తీసుకున్న కొత్త కలెక్టర్లు పాలపై, అభివృద్ధి పనులపై ఫోకస్​ చేశారు. గురువారం క్షేత్ర స్థాయి పర్యటనలు, సమీక్షలు, అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. నాగర్​ కర్నూల్​ కలెక్టర్ బదావత్ సంతోష్ తన చాంబర్​లో అధికారులు, రైస్​ మిలర్లతో సీఎంఆర్​ పై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, మహబూబ్​నగర్​ కలెక్టర్​ విజయేందిర బోయి నులిపురుగుల నివారణ మందుల పంపిణీలో పాల్గొన్నారు. 

వారం రోజుల్లో సీఎంఆర్​ను   అందించాలి : కలెక్టర్​ బాదావత్​ సంతోష్​ 

 2022 -– 23 సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ ను(సీఎంఆర్) ఈనెల 26లోగా అందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ రైస్ మిల్లర్లకు ఆదేశించారు. గురువారం అడిషనల్​ కలెక్టర్ సీతారామారావుతో కలిసి సివిల్ సప్లయ్​ అధికారులు, రైస్ మిల్లర్ల యజమానులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. 26 లోగా రైస్ మిల్లర్లు బియ్యాన్ని  ఎఫ్ సీఐకి పంపాలని, రైస్​ను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

2022-– 23 వానాకాలానికి సంబంధించిన 93,268 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ కు గానూ నేటికి 75,853 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి చెల్లించారని, ఇంకా 17,415 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాలని గుర్తు చేశారు. అదేవిధంగా 2023– -24 వానాకాలానికి సంబంధించి 49048 మెట్రిక్ టన్నులకు, 71,92 మెట్రిక్ టన్నులే చెల్లించారని చెప్పారు. గడువులోగా బియ్యాన్ని అందించాలని చెప్పారు. 

సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, సివిల్ సప్లై మేనేజర్ బాలరాజు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ లో కలెక్టర్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు వేశారు. అల్బెండజోల్‌ మాత్రలు వేయడం వల్ల నులిపురుగులు పిల్లల శరీరం నుంచి బయటకు పోతాయన్నారు. ఒక సంవత్సరం వయస్సు పిల్లల నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న అందరికీ ఈ నులిపురుగు నివారణ మందులు వేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుధాకర్ లాల్, డీఈఓ గోవిందరాజులు, జిల్లా ఇమినైజేషన్ అధికారి రవి పాల్గొన్నారు. 

చదువుతో పాటు ఆరోగ్యం చాలా అవసరం

 ఆరోగ్యంతో ఉన్నప్పుడే విద్యార్థులు చదువులో   రాణించే అవకాశాలు  ఉంటాయని, విద్యార్థుల ఆరోగ్యంపై టీచర్లు దృష్టి సారించాలని కలెక్టర్లు సూచించారు.  గురువారం మహబూబ్​నగర్, వనపర్తి జిల్లాలో నులి పురుగు నివారణ మందుల పంపిణీలో కలెక్టర్లు ఆదర్శ సురభి, విజయేందిర బోయి పాల్గొన్నారు. మహబూబ్​నగర్​లోని మాడ్రన్ హై స్కూల్ లో అల్బెండజోల్ మాత్రలను కలెక్టర్​ విజయేందిర బోయి విద్యార్థులకు వేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో డీఈఓ రవీందర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శంకర్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తో కలిసి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఎవరైనా మాత్ర తీసుకోకుండా  ఉంటే వారికి ఈ నెల27న ఇంటింటికీ తిరిగి మాత్రలు వేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 

మిషన్​ భగీరథ పనులు పూర్తి చేయాలి 

మిషన్​ భగీరథ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్లు ఆదేశించారు. నాగర్​ కర్నూల్​ జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం, రంగారెడ్డి పల్లి లో కలెక్టర్ బాదావత్ సంతోష్ ఇంటింటి సర్వేను, పాఠశాలను , గ్రామపంచాయతీ ఆఫీస్​ను ఆకస్మికంగా సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో పెండింగ్ పనుల వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఓ కృష్ణ, డీఈఓ గోవిందరాజులు, ఇన్​చార్జి సీఈఓ గోపాల్ నాయక్, తహసీల్దార్​ శ్రీరాములు తదితరులు ఉన్నారు. వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన అనంతరం గోపాల్ పేట మండలంలో పర్యటించారు. 

మిషన్ భగీరథ నల్లాల ఇంటింటి సర్వే, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతి, గోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే పూర్తి చేసిన వెంటనే పంచాయతీ సెక్రటరీల ద్వారా నివేదిక అందజేయాలని సూచించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని, మలేరియా, టైపాయిడ్, డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 

21న జిల్లాలోని ప్రతి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని ఆదేశించారు. గోపాల్ పేట మండలం ఈదమ్మ గడ్డ ప్రాథమిక పాఠశాలలో సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పనులను త్వరితగతిన చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దాలని నారాయణపేట కలెక్టర్​ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాల, తిమ్మాయిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ ఘనీ, పుర కమిషనర్ చికినె శశిధర్ తదితరులు ఉన్నారు. 

కలెక్టర్​ను కలిసిన నూతన ఎస్సీ జానకి 

 నూతన ఎస్సీగా బాధ్యతలు చేపట్టిన ఎస్సీ జానకి గురువారం కలెక్టర్ విజయేందిర బోయిని తన చాంబర్​ లో కలిశారు. పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు.