- ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను సన్మానించిన మంత్రి తుమ్మల
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు స్వాగతం పలికిన బదిలీ అయిన కలెక్టర్ ప్రియాంక అల
ఖమ్మం/ఖమ్మం టౌన్/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతన కలెక్టర్లు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. పెద్దపల్లి కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం కలెక్టర్ గా బదిలీపై వచ్చారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయనను అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎంఏ గౌస్, ఆర్డీవోలు జి. గణేశ్, ఎల్. రాజేందర్, కలెక్టరేట్ ఏవో అరుణ
ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ను మంత్రి శాలువాతో సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పాలనను గాడిలో పెట్టాలని సూచించారు.
ప్రజలు అధికంగా ఉన్న ఖమ్మం అర్బన్ మండలాన్ని రెండు మండలాలుగా చేయాలని చెప్పారు. జిల్లాలో జాతీయ రహదారులు, సీతారామ ప్రాజెకు తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ విషయంలో రైతులను ఒప్పించాలన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు.
జిల్లా సమగ్రాభివృద్దే లక్ష్యం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. కామారెడ్డి జిల్లా నుంచి బదిలీపై వచ్చి ఇక్కడి కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టిన ఆయనకు బదిలీపై వెళ్లిన కలెక్టర్ ప్రియాంక అల స్వాగతం పలికారు. అడిషనల్ కలెక్టర్ విద్యాచందనతో పాటు పలువురు జిల్లా అధికారులు నూతన కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జితేశ్మాట్లాడుతూ భద్రాద్రికొత్తగూడెంలో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచేలా చర్యలు చేపడుతానని చెప్పారు. అనంతరం ఆయన భద్రాచలం సీతారామరాములస్వామిని దర్శించుకున్నారు.
ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా బాధ్యతలు
భద్రాచలం : భద్రాచలం ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పీవోగా పనిచేసిన ప్రతీక్ జైన్‌కు ప్రమోషన్‌పై వికారాబాద్ కలెక్టర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఇన్చార్జ్ బాధ్యతలను జితేశ్ తీసుకున్నారు. అనంతరం యూనిట్ఆఫీసర్లతో జీతీశ్ మాట్లాడుతూ వర్షాకాలం వచ్చినందున ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని సూచించారు. విద్య, వైద్యంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు బాధ్యతలు మరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మానవత్వాన్ని చాటుకున్న నూతన కలెక్టర్
బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జితేశ్ వి పాటిల్ మొదటిరోజే తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం భద్రాచలం రామాలయం సందర్శన అనంతరం కొత్తగూడెంకు తిరుగుప్రయాణమైన కలెక్టర్ మండలంలోని సారపాక శివారులో చేరుకున్న సమయంలో ఆటో, బైక్ ఢీకొని క్షతగాత్రులు రోడ్డుపై పడివుండటాన్ని గమనించారు.
వెంటనే కారు దిగి స్వయంగా ఆయనే గాయపడినవారికి సహాయం చేశారు. తన వాహనంలోనే భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ఏపీలోని ఎటపాకకు చెందిన వారు కాగా, బైక్‌పై వెళ్తున్నవారి వివరాలు తెలియాల్సి ఉంది.