
మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్పరిధిలో ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి దందాలపై ఉక్కుపాదం మోపుతామని కొత్త కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్‌నుంచి బదిలీపై వచ్చిన ఆయన సోమవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో చార్జి తీసుకున్నారు. బదిలీపై వెళ్తున్న సీపీ ఎం.శ్రీనివాస్ నుంచి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు 24 గంటలు పనిచేస్తామన్నారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే తనను నేరుగా కలవొచ్చని, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్త సీపీకి పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బదిలీపై వెళ్తున్న సీపీ శ్రీనివాస్‌కు అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేస్తా
ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేస్తానని ఆదిలాబాద్ కొత్త ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిం చారు. మొదట పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, కరీంనగర్ సీపీగా బదిలీపై వెళ్తున్న గౌస్ ఆలం నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేస్తామన్నారు.
క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెడుతామన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకుంటామన్నారు. అడిషనల్ ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, సీహెచ్.నాగేందర్, హసీబుల్లా తదితరులు ఎస్పీకి స్వాగతం పలికారు.