ఖాళీగా ఉండుడే పని..!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న చాలామందికి వర్కింగ్ అవర్స్ పెరిగాయి. మునుపటి కంటే టార్గెట్లు ఎక్కువయ్యాయి. దాంతో పేరుకు ఇంట్లో ఉంటున్నారే తప్ప, పిల్లలతో గడపడానికి టైం ఉండట్లేదు. అంతేకాదు, భార్యాభర్తలిద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉంటే, ఆ ఇల్లు ఒక ఆఫీస్ అయిపోతోంది. అమ్మానాన్నలు కంప్యూటర్ల ముందు కూర్చుంటే.. పిల్లలు మరో రూమ్‌లో ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. అయితే ఇలాంటి బిజీ షెడ్యూల్ నుంచి బయటికొచ్చి పిల్లలతో గడిపేందుకు వచ్చిన కాన్సెప్ట్ ‘డూ నతింగ్’. అంటే ఏ పనీ చేయకుండా ఉండటం.
ఆఖరిసారిగా మీరు ఏ పనీ చేయకుండా ఉన్నదెప్పుడు? ఎప్పుడైనా ఖాళీగా ఉండి.. టైం వేస్ట్ కాలేదని అనుకున్నారా? ఎలాంటి ప్లాన్ లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారా? ఇలాంటి ప్రశ్నలు కొత్తగా ఉంటాయి. ‘పిల్లలతో రోడ్ ట్రిప్స్‌కి వెళ్తున్నాం’, ‘పార్క్‌లో గేమ్స్ ఆడుతున్నాం’, ‘ఆన్లైన్ క్లాసులప్పుడు హెల్ప్ చేస్తున్నాం’.. ఇవన్నీ పిల్లల కోసమే కదా అంటారా? అయితే ఇవేవీ ‘డూ నతింగ్’ కిందకు రావు. మరి ఏం చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం.
పది నిమిషాలు చాలు
ఆఫీస్ పని, ఇంట్లో పనులు రోజూ ఉండేవే. అయితే వాటికోసం ఇరవై నాలుగ్గంటలు కేటాయించనక్కర్లేదు. అలాగని డూ నతింగ్ కోసం గంటల సమయం అవసరం లేదు. రోజు మొత్తంలో నాలుగు గంటలకోసారైనా ఐదు, పది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఆ పది నిమిషాలు ప్రపంచానికి పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యి ఫ్యామిలీతోనే ఉండాలి. కావాలంటే రోజులో ఎప్పుడెప్పుడు ఖాళీగా ఉండాలో ఒక షెడ్యూల్ వేసుకోవచ్చు. మొదట్లో ఆ టైం పీరియడ్‌లో ఏం చేయాలో తెలియకపోవచ్చు. కానీ, వారాలు గడుస్తున్న కొద్దీ డూ నతింగ్ కాన్సెప్ట్‌ని ఎవరికి వాళ్లు కొత్తగా ట్రై చేస్తారు. ఆఫీస్ ఫోన్ కాల్స్ మధ్యలో పావుగంట గ్యాప్ వచ్చినా, బాస్‌తో అపాయింట్మెంట్ కాన్సిల్ అయినా.. ఆ టైంని డూ నతింగ్కి ఉపయోగించుకోవచ్చు. అంతేతప్ప ఆ గ్యాప్‌లో ఫోన్ పట్టుకోవడం, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం కాకుండా పిల్లలతో రిలాక్స్ అవ్వాలి.
స్టార్ట్ స్మాల్
డూ నతింగ్ అనేది అనుకున్నంత సులువు కాదు. ఎలాంటి ప్లాన్స్, షెడ్యూల్స్, ఎజెండా లేకుండా మైండ్‌ని క్లియర్‌గా ఉంచుకోవడమే ఈ కాన్సెప్ట్. పిల్లలైనా, పెద్దలైనా ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టిన కొత్తలో ఎక్కువ సమయం ఖాళీగా ఉండటం కష్టం. అందువల్ల చిన్నచిన్న ఇంటర్వెల్స్‌లో డూ నతింగ్ని సెట్ చేసుకోవాలి. ఆఫీస్ వర్క్‌లో ఉన్నప్పుడు మధ్యమధ్యలో ఐదు నిమిషాలు పిల్లలు, ఫ్యామిలీతో గడపొచ్చు. అలాగని వాళ్లతో బలవంతంగా బుక్ రీడింగ్, డ్రాయింగ్ చేయించడం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్లతో గడపడం ముఖ్యం.
గిల్టీ ఫీలింగ్ వద్దు
ఇంతసేపు ఏమీ చేయకుండా టైం వేస్ట్ చేశామనే గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు.అందువల్ల ఎప్పటికప్పుడు మనసుకు గుర్తుచేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ‘మనం సంతోషంగా, ప్రశాంతంగా ఉండటానికి కావాలనే ఏం చేయొద్దనే కాన్సెప్ట్‌ని ఎంచుకున్నాం’ అని. కాబట్టి ‘టైం వేస్ట్ అయింది.. బద్ధకంగా ఉన్నామా’ అనే అనుమానాలు పెట్టుకోవద్దు. ఫ్యామిలీ లైఫ్‌తో పాటు ఆఫీస్ వర్క్‌లో ప్రొడక్టివిటీ పెరగాలంటే ఇలాంటి చిన్నచిన్న బ్రేక్స్ చాలా అవసరం.
రూల్స్ పెట్టొద్దు
ఎజెండా లేకుండా ఫ్యామిలీతో కూర్చుని టైం గడపడం ఎలా? అనే సందేహం అందరికీ వస్తుంది. తెలియకుండా ఒక గేమ్ లేదా యాక్టివిటీ ప్లాన్‌ని బ్రెయిన్ సూచిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని అప్పటి ప్రజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఒక్కోసారి పిల్లలకు బోర్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి మాటలతో ఎంగేజ్ చేయొచ్చు. పిల్లలకు ఆడుకోవాలని ఉంటే ఆడనివ్వాలి. కానీ ఆటలో పేరెంట్స్ ఏ రూల్స్ పెట్టొద్దు. ఇలా చేస్తున్న కొద్దీ పిల్లలతో పాటు పెద్దలూ క్రియేటివ్‌గా టైంని స్పెండ్ చేస్తారు.
చుట్టు పక్కల తిరిగితే చాలు
డూ నతింగ్ కోసం పార్కులు, దూర ప్రదేశాలకు వెళ్లడం కరెక్ట్ కాదు. చుట్టుపక్కల పరిసరాల్లోనే టైం స్పెండ్ చేయాలి. ఫిట్నెస్ గోల్స్‌ని పక్కనబెట్టి, పిల్లలతో ఇంటిచుట్టూ నాలుగు రౌండ్లు వాకింగ్ చేయొచ్చు. పువ్వులు, ఆకులు, మట్టిని చూపించి పిల్లలకు వాటి కలర్స్ ఏంటో చెప్పొచ్చు. చల్లటి గాలులను ఎంజాయ్ చేయొచ్చు. నడుస్తున్న అడుగుల చప్పుళ్లను అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ డూ నతింగ్ టైంలో చేస్తే, పిల్లలు పేరెంట్స్‌తో పాటు నేచర్‌కి కూడా కనెక్ట్ అవుతారు. అయితే ఉదాహరణకు చెప్పిన పనులను పనికట్టుకుని చేయొద్దు సుమీ.
అన్‌ప్లగ్ గ్యాడ్జెట్స్
ఫిజికల్‌గా.. మెంటల్‌గా ఎప్పుడైనా డల్ అయినప్పుడు చాలామంది చేసేపని ఫోన్ పట్టుకోవడం లేదా టీవీ ఆన్ చేయడం. అయితే ఈ రెండూ టైం, ఎనర్జీని వాడుకుంటాయే తప్ప బూస్ట్ చేయలేవు. డూ నతింగ్ కాన్సెప్ట్‌లో మైండ్ అసలు ఎంగేజ్లో ఉండకూడదు. ఫోన్ పట్టుకున్నారంటే.. బ్రెయిన్ దాన్ని చూసే పనిలో ఉందని, అదే బ్రెయిన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఎనర్జీని ఖర్చు చేస్తోందని అర్థం చేసుకోవాలంటాడు ఇంగ్లీష్ రైటర్ సెలెస్టే హెడ్లీ. అందువల్ల డూ నతింగ్లో టైంని ఫోన్, టీవీకి కాకుండా ఫ్యామిలీకి ఇవ్వాలి. ఖాళీ టైం దొరికినప్పుడు ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాలి. లాప్టాప్ వంటి గ్యాడ్జెట్స్‌ని ఆఫ్ చేయాలి. ఆ టైంలో పిల్లల్ని వీధుల్లో తిప్పుతూ ఆకాశంలో నెమ్మదిగా ప్రయాణిస్తున్న మేఘాలను చూస్తుండొచ్చు. కావాలంటే అలారం సెట్ చేసుకుని, మళ్లీ వర్క్‌లో జాయిన్ అవ్వచ్చు.
for more news…