మార్పుకే జైకొట్టిన .. తెలంగాణ

మార్పుకే జైకొట్టిన ..  తెలంగాణ

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని కాంగ్రెస్​ పార్టీ నినాదం క్షేత్రస్థాయిలో ప్రజలలోకి బలంగా వెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వరుసగా రెండు పర్యాయాలు గెలిచి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ మూడోసారి జరిగిన ఎన్నికలలో చతికిలబడింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండుసార్లు గెలవలేకపోయినా కాంగ్రెస్ ఈసారి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

కర్ణాటకలో  కాంగ్రెస్  గెలిచిన తర్వాత ఆ ప్రభావం పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై పడటం, తెలంగాణలో కూడా విజయం సాధించటంతో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ బలపడటానికి దోహదం చేస్తుందనటంలో సందేహం లేదు. తెలంగాణతోపాటు మరొక నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినా... మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్​గఢ్, మిజోరాం రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమిపాలైంది. అయితే,  తెలంగాణలో గెలుపు ఒకరకంగా దక్షిణాదిన కాంగ్రెస్ బలాన్ని పెంచిందనే చెప్పాలి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షించాయంటే  తెలంగాణలో  కాంగ్రెస్​ గెలుపు ఎంత ప్రతిష్టాత్మకమైనదో అర్థమవుతుంది. 

కాంగ్రెస్​ బలాన్ని పెంచిన చేరికలు

నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్,  వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ప్రజలు మార్పు కావాలని బలంగా కోరుకున్నారు. ఈ జిల్లాల్లో 61 శాసనసభ స్థానాలు ఉంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీ 50 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.  ఆదిలాబాద్, నిజామాబాద్,  మెదక్, రంగారెడ్డి జిల్లాలలో గతంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం 6 స్థానాలకు పరిమితమైంది. అయితే, ఈ సారి ఈ జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రాతినిధ్యం 14 శాసనసభ స్థానాలకి పెంచుకుంది. కానీ, గత రెండు ఎన్నికలలో మాదిరిగానే హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది శాసనసభ్యులలో 20 మంది పార్టీలో కొత్తగా చేరి గెలిచినవారు ఉన్నారంటే చేరికలు కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచాయనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, యువత కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఎస్సీ, ఎస్టీ 31 రిజర్వుడ్​ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ 23 నియోజకవర్గాలలో జయకేతనం ఎగరవేసింది. జాతీయ అంశాల దృష్ట్యా మైనార్టీలు, ఉద్యోగాల భర్తీ విషయం, పోటీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో యువత మార్పు కావాలని కాంగ్రెస్ వైపు మొగ్గటం వలన కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరగలిగింది.

కామారెడ్డి ఓటర్ల వినూత్న తీర్పు

2018 ఎన్నికలలో కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి ఎదురైనా.. నిత్యం ప్రజలతోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడిన కాటేపల్లి వెంకటరమణారెడ్డిని ఇద్దరు బలమైన అభ్యర్థులను కాదని ఓటర్లు  గెలిపించారు. ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగిన పరిణామంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి తెలుగు ప్రజలు అండగా నిలుస్తున్నారని తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో మరొకసారి రుజువైంది. కష్టకాలంలో ఇందిరాగాంధీని లోక్​సభ సభ్యురాలిగా మెదక్ నుంచి గెలిపించడం, 2004, 2009లో  కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండగా నిలబడింది.

 ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారు. తెలంగాణలో కూడా ఓడిపోయి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి తిరోగమనం పాలయ్యేది.  కానీ, తెలంగాణ ప్రజలు హస్తానికి జై కొట్టి ఊతమిచ్చారు. అయితే, తెలంగాణలో పాలన కాంగ్రెస్ నాయకులకి నల్లేరుపై నడక మాత్రం కాదు.  కాంగ్రెస్ తన గ్యారంటీలను, డిక్లరేషన్​లను,  మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను చిత్తశుద్ధిగా అమలు చేయాలి.  అంతేకాదు శాసనసభలో బలమైన బీఆర్ఎస్ ప్రతిపక్షాన్ని కూడా ఎదుర్కోవాలి. కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా, అవినీతి రహితంగా ప్రజల కోసం పనిచేయకపోతే వ్యతిరేక ఫలితాలు పునరావృతం అవుతాయి.  ప్రజల పక్షాన నిలిచి ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా  కాంగ్రెస్​ప్రభుత్వ పాలన కొనసాగాలని ఆశిద్దాం.

ఓటమిని పసిగట్టిన బీఆర్ఎస్

ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందనను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మళ్లీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మిషన్ మోడ్ లో నిర్మిస్తాం, ఉద్యోగాలను భర్తీ చేస్తాం, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని చెప్పినా ప్రజలు మాత్రం మార్పుకే ఓటేశారు. ఓటమిని ముందే పసిగట్టిన కేటీఆర్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం, మీడియా ఇంటర్వ్యూల ద్వారా సందేశాలు పంపటమే కాదు చివరి ప్రయత్నంగా గునుగుడు గునుగుడే.. గుద్దుడు గుద్దుడే అనే నినాదాన్ని పట్టుకు వచ్చినా ఓటమి నుంచి బీఆర్ఎస్​ బయటపడలేకపోయిందని ఫలితాల సరళి తేట తెల్లం చేసింది.

అహంకారంతో పాతాళానికి..

కేసీఆర్ 10 సంవత్సరాల పాలన అహంకార పూరితంగానే కొనసాగటం వలన ఓటమి ఎదురైందనే భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగాల్సిన చోట.. తాను ఏది అనుకుంటే అది, తాను ఏమి చేస్తే అదే..  ప్రజలు అంగీకరించి తీరాలనే  కేసీఆర్ విపరీత మనస్తత్వ ధోరణిని ఆత్మగౌరవం మెండుగా ఉన్న తెలంగాణ ప్రజలు అంగీకరించలేకపోయారు. ముఖ్యంగా బీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకొచ్చిన తరువాత ప్రజల నుంచి దూరమైన కేసీఆర్ వ్యవహార శైలితో ప్రజల నుంచి ప్రభుత్వం మారాలనే అభిప్రాయం వ్యక్తం అయింది.  

ప్రవళిక చనిపోతే,  మేడిగడ్డ కుంగిపోతే, కేటీఆర్ మాట్లాడిన తీరు, అదేవిధంగా  ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు ప్రజలలో మరింత వ్యతిరేకతను పెంచింది.  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తో సరితూగే నేతలే లేరు.. కేసీఆర్ ను ఓడించే స్థాయి రేవంత్ రెడ్డి,  కిషన్ రెడ్డిలకు లేదనే అహంకార ధోరణితో బీఆర్ఎస్​నాయకులు తమ ఓటమికి వారే బాధ్యులయ్యారు. ప్రజల పక్షాన శాసనసభలో కానీ,  ప్రజాక్షేత్రంలో కానీ  ప్రశ్నించే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయటానికి,  ఫిరాయింపులను ప్రోత్సహించి శాసనసభలో ఏకపక్షంగా వ్యవహరించిన తీరుతో  ప్రజలు విసిగిపోయారు. ఈ కారణంతోనే  ప్రజలు 12 మంది ఫిరాయింపుదారులను ఈ ఎన్నికలలో ఓడించారనే విషయాన్ని గమనించాలి.

- డాక్టర్ తిరునహరి శేషు, పొలిటికల్​ ఎనలిస్ట్, కాకతీయ యునివర్సిటీ