
ఆసిఫాబాద్, వెలుగు: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో 100 సీసీ కెమెరాలతో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను సీఐ రవీందర్ తో కలిసి ప్రారంభించారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ పట్టణాన్ని పూర్తి నిఘా నీడలోకి తెచ్చి, నేర రహిత పట్టణంగా మార్చడమే లక్ష్యమన్నారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ర్యాష్ డ్రైవింగ్, జిల్లాకు వచ్చే అనుమానిత వాహనాలను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీతో పట్టణంలోని ముఖ్య ప్రదేశాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ఆధారంగా నిబంధనలు ఉల్లఘించిన వాహనాలు, అనుమానిత వాహనాలను గుర్తించి యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎస్సై వెంకన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో నేరాల నియంత్రణపై ఫోకస్ పెట్టామని, ఇందులో భాగంగా సబ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంతాల్లో చిన్నచిన్న దొంగతనాలు, పిక్ పాకెట్స్, ఈవ్‌టీజింగ్, రోడ్డు ప్రమాదాలు అరికట్టే ప్రయత్నం చేస్తున్నామని, తక్షణ సహాయం కోసం బుధవారం కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉండి ప్రజలకు సేవలందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు కరుణాకర్ రావు, సునీల్ కుమార్, ప్రణయ్ కుమార్, ఏఎస్ఐ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.