తిరువనంతపురం: కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి జరిగిన15 రోజులకే వధూవరులు చనిపోయారు. కేరళకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టడంతో కొత్త దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని పథనంతిట్టకు చెందిన అను, నిఖిల్‌కు ఇటీవలే పెండ్లి అయింది. హనీమూన్‌కు మలేసియా వెళ్లి ఆదివారం తిరిగి వచ్చారు. ఈ క్రమంలో తిరువనంతపురంలో వాళ్లను రిసీవ్ చేసుకోవడానికి కుటుంబసభ్యులు ఎయిర్ పోర్ట్‌కు వెళ్లారు. అంతా కలిసి కారులో తిరిగివస్తుండగా పథనంతిట్ట వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు వెళ్తున్న బస్సును కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు స్పాట్లోనే మృతిచెందారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో బయటకు తీశారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బాధితుల నివాసానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.