న్యూఢిల్లీ: కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి ప్రపంచం క్రమంగా కోలుకుంటున్న వేళ.. కొవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందన్న వార్త గుబులు రేపుతోంది. ఎక్స్ఈగా పిలుస్తున్న ఈ వేరియంట్.. ఒమిక్రాన్ కంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోల్చుకుంటే ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది. ఎక్స్ఈ వేరియంట్ వృద్ధిరేటు 10 శాతం ఉందని డబ్ల్యూహెచ్వో తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో వెల్లడించింది. ఎక్స్ఈను యూకేలో జనవరి 19న తొలిసారి కనుగొన్నామని.. 600 కంటే ఎక్కువ ఎక్స్ఈ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపింది. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ సంఖ్యలో కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని.. పబ్లిక్ హెల్త్ రిస్క్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ చెప్పారు. ఎక్స్ఈతోపాటు ఎక్స్డీ, ఎక్స్ఎఫ్ అనే మరో రెండు వేరియంట్లు కూడా కనుగొన్నామని పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం: