New Cricket Rules: ఆసీస్ క్రికెటర్లకు ఝలక్.. క్రికెట్‌లో కొత్త రూల్స్‌

New Cricket Rules: ఆసీస్ క్రికెటర్లకు ఝలక్.. క్రికెట్‌లో కొత్త రూల్స్‌

క్రికెట్‌ రూల్స్‌‌ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఝలక్ ఇచ్చింది. పాత నిబంధనల్లో సవరణలు చేస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఏంటి..? ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డీఆర్‌ఎస్ కోరితేనే క్యాచ్ చెక్

ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ నిబంధన ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్టంపింగ్ కోసం అప్పీల్ చేసినప్పుడు స్టంప్ ఔట్ మాత్రమే చెక్ చేయనున్నారు. అదే గతంలో అయితే కీపర్.. స్టంపౌట్ కోసం ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరితే క్యాచ్ ఔట్‌ను కూడా చెక్ చేసేవారు. ఇలా చేయడం వల్ల ఫీల్డింగ్ జట్టు డీఆర్‌ఎస్ కోరకుండానే క్యాచ్ విషయంలో లాభపడేది. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఐసీసీ మార్పులు చేసింది.  ఇకపై కీపర్ స్టంపింగ్ చేసిన సమయంలో క్యాచ్ ఔట్‌పై ఏమైనా సందేహాలుంటే డీఆర్‌ఎస్ కోరాల్సి ఉంటుంది.

గతేడాది ఆరంభంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కారీ డీఆర్‌ఎస్ కోరకుండానే స్టంపింగ్ అనంతరం క్యాచ్ ఔట్‌పై ఫీల్డ్ అంపైర్‌ను ఉపయోగించుకున్నాడు. ఆ సమయంలో కామెంటేటర్లు అతని తెలివితేటలను ప్రశంసించారు. డీఆర్‌ఎస్ తీసుకోకుండానే క్యాచ్‌పై ఎలా అప్పీల్ చేయాలో అతన్ని చూసి నేర్చుకోవాలని సూచించారు.

సబ్‌స్టిట్ట్యూట్‌‌ ప్లేయర్‌కు నో బౌలింగ్

కంకషన్ రూల్‌లోనూ ఐసీసీ మార్పులు చేసింది. ప్లేయర్‌ తలకు గాయమైనప్పుడు కంకషన్ ప్లేయర్‌కు సబ్‌స్టిట్ట్యూట్‌‌గా వచ్చే ఆటగాడికి ఓ షరతు పెట్టింది.. ఐసీసీ. కంకషన్ గురైన ఆటగాడు బౌలింగ్ నిషేధానికి గురైతే.. సబ్‌స్టిట్ట్యూట్‌గా వచ్చే ప్లేయర్‌కు కూడా బౌలింగ్ చేసే అవకాశం లేకుండా సవరణ చేసింది. అయితే, బ్యాటింగ్ విషయంలో ఎలాంటి మార్పులు లేవు.  

4 నిమిషాలు

ఏదేని ఆటగాడు మైదానంలో గాయపడిన సమయంలో అతనికి వైద్యం అదించే చికిత్సకు ఐసీసీ టైమ్ లిమిట్ పెట్టింది. అందుకోసం నాలుగు నిమిషాల సమయం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆట వేగాన్ని పెంచేలా ఐసీసీ ఇటీవల 'స్టాప్ క్లాక్' రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బౌలింగ్ జట్టు ఒక ఓవర్ పూర్తి చేశాక.. తదుపరి ఓవర్ వేయడానికి 60 సెకన్లలోపు సిద్ధమవ్వాలి. ఇలా రెండు సార్లు విఫలమైతే.. మూడోసారి బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు అదనంగా కలుపుతారు.