సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందని కొత్త సీఎస్ శాంతి కుమారి అన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తొలి ప్రసంగంలో ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ప్రభుత్వ ఆఫీసులకు వస్తే జనం కూర్చునేందుకు కూడా అవస్థలుపడేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని అన్నారు. కొత్త కలెక్టరేట్ బిల్డింగులు చూస్తే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్సా లేక ఇంద్రభవనమా అన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. ఇలాంటి భవనాలు అందుబాటులోకి తెచ్చిన కేసీఆర్ కు శాంతికుమారి కృతజ్ఞతలు చెప్పారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వ ఆదాయం రూ.63వేల కోట్లుగా మాత్రమే ఉండేదని, ఇప్పుడు అది 3 రెట్లు పెరిగి లక్షా 80 కోట్లకు చేరిందని శాంతి కుమారి చెప్పారు. ముఖ్యమంత్రి ఆ నిధులతో ప్రపంచం ఆశ్చర్యపోయే గొప్ప కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. పాలనా సంస్కరణలతో 33 కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగులకు సకల వసతులు కల్పించారని ప్రశంసించారు. ప్రజారంజక పాలన అందిస్తున్న కేసీఆర్ భవిష్యత్తులోనూ వాటిని కొనసాగించాలని ఆకాంక్షించారు. అధికార యంత్రాంగం అంతా చిత్తశుద్ధితో పని చేసే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.