జీపీ కార్మికుల సమస్యలపై ప్రజా ఉద్యమం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే వారి పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలు హెచ్చరించారు. ఇదే విషయంపై డిమాండ్​చేస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్​ప్రజాపంథా, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్​రావు, ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, సీపీఐఎంఎల్​న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎల్. విశ్వనాథం మాట్లాడారు.

 గ్రామీణ ప్రాంతాల్లో అవార్డులు రావడంలో కీలకపాత్ర పోషించిన జీపీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 26 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్​పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వారిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్​చేశారు. అనంతరం కలెక్టర్​ప్రియాంక అలాకు వినతిపత్రాన్ని అందించారు. ప్రోగ్రాంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీలు, కార్మిక సంఘాల నేతలు ఏజే. రమేశ్, యూసుఫ్, అన్నవరపు కనకయ్య, సాబీర్ పాష, బ్రహ్మచారి, గుత్తుల సత్యనారాయణ, యాకూబ్​షావళి, మధుసూదన్​రెడ్డి, జగతి వెంకన్న, జాడి సురేశ్​ పాల్గొన్నారు.