డిజిటల్ ఇండియా సాధనలో టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థది ప్రముఖ పాత్ర. మొన్న కరోనా కష్టకాలంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడం లాంటి కీలక పనులు చక్కబెట్టడంలో టెలి కమ్యూనికేషన్ రంగం ప్రముఖ పాత్ర పోషించింది. లాక్డౌన్ లో ఇంటర్నెట్ కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నాణ్యమైన, పటిష్టమైన టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఉండటం వల్లే లక్షలాది మంది అవసరమైన వస్తువులను కొనడం, ఆర్థిక లావాదేవీలు చేయడం, వార్తలు తెలుసుకోవడం ముఖ్యంగా స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసులు వింటూ చదువులు కొనసాగించడం చేశారు. ఆరోగ్య సేతు లాంటి యాప్ ద్వారా కరోనా బారినపడిన వారి వివరాలను సేకరించడంలో, వారికి అవసరమైన ఆరోగ్య సూచనలను అందించడంలో మొబైల్ ఇంటర్నెట్వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడింది.
వినియోగదారులు పెరుగుతున్నరు..
టెలికమ్యూనికేషన్ రంగంలో సౌకర్యాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ఖర్చు(2014–2019 మధ్య) ఆరు రెట్లు పెరిగింది. దాదాపు 60 వేల కోట్ల రూపాయలను వెచ్చించింది. 2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో టెలికామ్రంగం స్థూల ఆదాయం రూ.64,801 కోట్లుగా ఉంది. ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి బలమైన విధాన సహకారం అందడం కీలకమైంది. అందులో భాగంగానే ప్రభుత్వం టెలికామ్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐల) పరిమితిని 74 శాతం నుంచి100 శాతానికి పెంచింది. 2021 అక్టోబర్ నుంచి మునుపటి 49 శాతం నుంచి ఆటోమేటిక్ మార్గం ద్వారా 100 % విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఏప్రిల్ 2000 నుంచి మార్చి 2022 మధ్య టెలికామ్ రంగంలో ఎఫ్ డీఐల ప్రవాహం 38.33 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం. టెలీకమ్యూనికేషన్ మార్కెట్ వ్యవస్థను ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి వైర్లెస్(మొబైల్), రెండోది వైర్ లైన్(ఫిక్స్ డ్ లైన్), మూడోది ఇంటర్నెట్ సర్వీసెస్. ఇందులో వైర్లెస్ మార్కెట్ భాగం 98.8 శాతంగా ఉంది. ఇండియా ప్రపంచంలోనే 1.16 బిలియన్ వినియోగదారులతో రెండో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ మార్కెట్ గా ఉంది. టెలీ-డెన్సిటీ 84.88 శాతంగా ఉంది. ఏప్రిల్ 2022 నాటికి, మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సబ్ స్క్రిప్షన్లు 788.77 మిలియన్లకు పెరిగాయి. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య డిసెంబర్ 2021 వరకు 26.43 మిలియన్లుగా ఉంది. ఇంటర్నెట్ అతిపెద్ద డేటా వినియోగదారుల్లో ఇండియా ఒకటి.
ఇండియాలో తయారీ..
కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం 2022–23 ఏడాదికి టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి రూ.84,587 కోట్లు కేటాయించింది. రెవెన్యూ వ్యయం 36 %, మూలధన వ్యయం 64 % కేటాయించింది. నోకియా, శామ్సంగ్, హువావే వంటి ప్రపంచ టెలికామ్ నెట్వర్క్ తయారీదారులను100 శాతం స్థానిక ఉత్పత్తులతో భారతదేశంలో తమ పరికరాలను తయారు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రూ.12,195 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం ద్వారా ఇప్పటికే మొబైల్ పరికరాలు, విడిభాగాలను తయారు చేసే అనేక గ్లోబల్ ప్లేయర్ల(ఎరిక్సన్, శామ్సంగ్, సిస్కో, సియెనా, జాబిల్, ఫాక్స్కాన్, సాన్మినా, ఫ్లెక్స్, నోకియా) ప్రవేశాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నది. 2020 జూన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఎనిమిది వారాల వ్యవధిలో రూ.1.04 ట్రిలియన్ (14.75 బిలియన్ అమెరికా డాలర్ల) విలువైన 22.38 శాతం వాటాను, వేర్వేరు ఒప్పందాల కింద ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, ముబదాలా, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ఏడీఐఏ), టీపీజీ క్యాపిటల్, కాటర్టన్ సంస్థలకు విక్రయించింది. ప్రపంచంలో ఏ సంస్థ కూడా ఇంతవరకు, ఇంత పెద్ద మొత్తంలో నగదును సమకూర్చ లేదు. ఇది భారతదేశ టెలీ కమ్యూనికేషన్ రంగం శక్తిని తెలియజేస్తుంది. రాబోయే ఐదేండ్లలో తక్కువ ధరలకు మొబైల్స్ అందుబాటులోకి రావటం, డేటా ధరలు తగ్గడంతో ఐదు వందల మిలియన్ల కొత్త ఇంటర్నెట్ వినియోగదారులు చేరుతారని భారత మంత్రిత్వ శాఖ అంచనా వేస్తున్నది. 2016లో 2జీ, 3జీ, 4జీ స్పెక్ట్రమ్ వేలం ద్వారా రూ.65,789 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి 2జీ, 3జీ, 4జీ, 5జీ స్పెక్ట్రమ్అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 77814 కోట్లు వచ్చాయి. అయితే ఈ వేలంలో 700, 2500 మెగాహెడ్జ్స్పెక్ట్రమ్అమ్మకం జరగలేదు. ఈ ఏడాది నిర్వహించిన వేలంలో లక్షా 50 వేల కోట్లు సమకూరాయి. ఇందులో రిలయన్స్ జియో రూ.88,078 కోట్ల విలువైన బిడ్, భారతీ ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్లతో స్పెక్ట్రమ్ దక్కించుకున్నాయి. ఈ సంవత్సరం వేలం ద్వారా స్పెక్ట్రమ్ చరిత్రలో ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చింది. అమ్మకానికి ఉంచిన మొత్తం 72,000 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్‌లో సుమారు71 శాతం మాత్రమే విక్రయించడం గమనార్హం.
5జీతో విప్లవాత్మక మార్పులు
ప్రధాని మోడీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన ఆరో ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ 2022)లో 5జీ సేవలను ప్రారంభించారు. ఎరిక్సన్ కన్స్యూమర్ ల్యాబ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. రాబోయే 5జీ నెట్వర్క్ ను స్వీకరించడానికి భారతదేశం సంసిద్ధత యూకే, యూఎస్ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల కంటే రెట్టింపుగా ఉంది. 2023 నాటికి100 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత రెండేండ్లలో 5జీ హ్యాండ్ సెట్లను కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య దేశంలో మూడు రెట్లు పెరగడం గమనార్హం. హెల్త్ అండ్ ఫిట్ నెస్, 360 డిగ్రీల లైవ్ వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్, 5జీ టీవీ ప్యాకేజీ, వర్చువల్ మీటింగ్ స్పేస్, ఇమ్మర్సివ్ ఎడ్యుకేషన్, బెస్ట్ సీట్ఈవెంట్ ఎక్స్ పీరియన్స్, ఇంటరాక్టివ్ కాలింగ్, లొకేషన్ బేస్డ్ ఎఆర్ షాపింగ్, వీఆర్ షాపింగ్ వంటివి భారతీయ వినియోగదారులు 5జీ ద్వారా యాక్సెస్ చేసుకోవాలనుకునే ఇతర సేవల్లో కొన్ని. 2025 నాటికి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి 5G–సెంట్రిక్ టెక్నాలజీల్లో భారతదేశానికి 22 మిలియన్ల నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమవుతారు. 2022 ఆగస్టు 2న ఐ&టీసహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశం ప్రస్తుతం అగ్రశ్రేణి దేశాల్లో ఒకటిగా ఉందని, స్వదేశీ 5జీని లాంచ్‌చేసిన మొదటి దేశాల్లో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. రెడ్‌సీర్ కన్సల్టింగ్ పరిశోధన నివేదిక ప్రకారం.. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు 2025 నాటికి మూడు రెట్లు పెరిగి 7,092 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న160 మిలియన్ల మొబైల్ చెల్లింపు వినియోగదారులు, ఐదు రెట్లు పెరిగి 2025 నాటికి దాదాపు 800 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది.
ఉద్యోగాల సృష్టి..
భారతదేశం ఫోన్ల వినియోగంలో, ఇంటర్నెట్ వాడకంలో, యాప్స్ డౌన్లోడ్ చేయడంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఎరిక్సన్ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్‌కు ప్రపంచంలో అత్యధిక డేటా వినియోగం భారతదేశానికి నెలకు సగటున 9.8 జీబీగా ఉంది. ఇది 2024 నాటికి18 జీబీకి పెరుగుతుందని అంచనా. టెలికామ్ రంగం స్థూల ఆదాయం 2019 సంవత్సరానికి లక్షా 85 వేల 291 కోట్లు. భారత ప్రభుత్వం సరళీకరణ విధానాలు, సంస్కరణలతో పాటు, మార్కెట్లో ఉన్న బలమైన డిమాండ్ తో టెలీ కమ్యూనికేషన్ రంగం వేగంగా అభివృద్ధి సాధించింది. టెలికామ్ రంగంలో ఎఫ్‌డీఐ క్యాప్‌ను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం వల్ల పెట్టుబడులు బాగా పెరిగాయి. దేశంలో ఉద్యోగం కల్పించే ముఖ్యమైన 5 రంగాల్లో టెలీ కమ్యూనికేషన్ రంగం ఒకటి. డిజిటల్ కమ్యూనికేషన్ రంగం ఆధునిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ‘నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ 2018’ని ఆవిష్కరించింది. ఈ విధానం ద్వారా 2022–23 నాటికి100 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం, ఈ రంగంలో 4 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతున్నది.
–డా. చిట్టెడి కృష్ణారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ