ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్త డైట్ మెనూ షురూ.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్త డైట్ మెనూ షురూ.. 
  • పెంచిన డైట్ చార్జీలకనుగుణంగా మెనూ అమలు చేయాలి 
  • స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం అందించాలనే చార్జీల పెంపు 
  • మెనూ ప్రారంభంలో మంత్రలు, ఎమ్మెల్యేలు

ఖమ్మం/ఎర్రుపాలెం/దమ్మపేట, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లలో కొత్త డైట్ ​మెనూ షురూ అయ్యింది. పెంచిన డైట్, కాస్మోటిక్ ​చార్జీలను  పక్కాగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం బోనకల్ మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో భట్టి విక్రమార్క, తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలో తుమ్మల నాగేశ్వరరావు, ఆయా నియోజకవర్గాల్లోని హాస్టళ్లలో పలువురు ఎమ్మెల్యేలు కొత్త మెనూను ప్రారంభించారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్సియల్ పాఠశాలలలో చదువుతున్న  విద్యార్థులకు చదువుతోపాటు డైట్ మెనూ, కాస్మోటిక్ చార్జీలు పెంచిందని తెలిపారు. ప్రిన్సిపాల్స్, వార్డెన్లు తప్పనిసరిగా మెనూ ప్రకారం విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్​ అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్​ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఈఎంఆర్ఎస్ వోఎస్ డీ, అబ్జర్వర్ కృష్ణారావు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్, ఐటీడీఏ పీవో బి రాహుల్, ఆర్సీవో నాగార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

వైరా : వైరా నియోజకవర్గం తనికెళ్లలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో కలెక్టర్  ముజామ్మిల్ ​ఖాన్ కొత్త డైట్ మెనూను ప్రారంభించారు. హాస్టల్​లోని స్టోర్ రూమ్, లైబ్రరీ, డార్మెటరీ, వంటగది, డైనింగ్ రూమ్ లను పరిశీలించారు‌.  కావాల్సిన సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని స్టూడెంట్స్ గొప్ప స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కాగా వైరా మండలం ముసలిమడుగులోని రెసిడెన్షియల్ స్కూల్​లో వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​ డైట్ మెనూ ప్రారంభించి స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేశారు. 

ఖమ్మం టౌన్ : బలమైన ఆహారం తింటేనే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం రోడ్ లోని తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో కామన్ డైట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఆహార పదార్థాలు, కూరగాయలు, పచ్చళ్లు, సరుకులను సీపీ పరిశీలించారు. 

నాణ్యమైన భోజనమే  ప్రభుత్వం లక్ష్యం 

భద్రాచలం: హాస్టళ్లలో ఉండి చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలం టౌన్​లోని గురుకుల కాలేజీతో పాటు ఎస్సీ, ఎస్టీ బాలికల వసతిగృహాల్లో నూతన భోజన మెనూ పట్టికను ఆయన ప్రారంభించారు. స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఇంటిని మరిచిపోయేలా హాస్టళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

బూర్గంపహాడ్ : మండలంలోని ఉప్పుసాక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో డైట్ మెనూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయం వెంటకటేశ్వర్లు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు సారపాకలో సీసీ రోడ్డు, ముసలమడుగులో ఐటీసీ ఆధ్వర్యంలో  నిర్మించిన బస్ షెల్టర్ ను ఆయన ప్రారంభించారు. 

ఇల్లెందు : ఇల్లెందు పరిధిలోని  హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో  ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, మున్సిపల్​ కమిషనర్​ శ్రీకాంత్ కొత్త మెనూను ప్రారంభించారు. ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న మెనూ చార్జీలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చులకు అనుగుణంగా 40శాతం పెంచిందని వారు తెలిపారు. 

పాల్వంచ : పట్టణంలోని గిరిజన బాలికల డిగ్రీ గురుకులంలో ఎంఈవో  శ్రీరామ్మూర్తి, కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో హెచ్​ఎం రామారావు కొత్త మెనూను ప్రారంభించారు. స్థానిక బొల్లోరు గూడెం లోని మైనార్టీ గురుకులంలో మార్క్ ఫెడ్  డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, బొల్లోరు గూడెం ఎస్టీ బాలికల గురుకులంలో డాక్టర్ తేజశ్రీ ప్రారంభించి డైట్​ వల్ల ఉపయోగాలను వివరించారు. 
జూలూరుపాడు : మండలంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహలను  తహసీల్దార్​ స్వాతి బిందు సందర్శించారు. కొత్త డైట్ మెను ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని టీచర్లకు సూచించారు.