ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త మెనూ సంబురం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త మెనూ సంబురం
  • విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి  ఎమ్మెల్యేలు, అధికారుల  సహపంక్తి భోజనం

వెలుగు, నెట్ వర్క్ :  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డైట్ చార్జీల పెంపు కార్యక్రమం పండుగలా నిర్వహించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలోని సాంఘిక గురుకుల పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ..  తెలంగాణలో గత ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యారంగం అస్తవ్యస్తమైందన్నారు.ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి కన్న తల్లిదండ్రులు పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు.  అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థినిలతో కలిసి మంత్రి జూపల్లి సహపంక్తి భోజనం చేశారు.

మహబూబ్​నగర్​ రూరల్​ మండలం రామిరెడ్డిగూడెం సమీపంలోని బాలికల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్​ స్కూల్​, కాలేజ్​లో శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నూతన డైట్ మెనూను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  15 ఏండ్లుగా ఒకే రకమైన మెనూ ఉండేదని, బీఆర్​ఎస్​ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరించిందని ఫైర్ అయ్యారు.

జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేట తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్​కాలేజీలో కార్యక్రమాలకు కలెక్టర్​ చీఫ్​ గెస్ట్​గా పాల్గొన్నారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్స్ చార్జీలు 200 శాతం పెంచారన్నారు.  అన్ని పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు  అనంతరం విద్యార్థినులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.  

చదువుతోనే విద్యార్థులు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.  వనపర్తి నియోజకవర్గ పరిధిలోని  పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్​ స్కూలు, వనపర్తిలోని నాగవరం బీసీ హాస్టల్​ను ఆయన సందర్శించి సహపంక్తి భోజనం చేశారు. 

Also Read :- ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్ 2 కు పకడ్బందీ ఏర్పాట్లు

గద్వాల  జిల్లా కేంద్రంలోని సాంఘిక సమీకృత బాలుర హాస్టల్ లో ఏర్పాటు చేసిన యూనిఫామ్ డైట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంతోష్ , ఎస్పీ శ్రీనివాస రావు పాల్గొని  ఎస్ఓపీ హ్యాండ్ బుక్‌ను విడుదల చేశారు.  ప్రతి విద్యార్థికి నెల డైట్ ఖర్చును 1100 రూపాయల నుంచి 1540  రూపాయలకు పెంచినట్లు తెలిపారు. 
    
విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ, డైట్ చార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  ఆదేశించారు.  
    
ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల, కాలేజీలో నిర్వహించిన డైట్ చార్జీల పెంపు కార్యక్రమానికి  ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. 
    
విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా మెస్ చార్జీలను పెంచామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్  రెడ్డి అన్నారు. బిజినేపల్లి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికే డైట్ చార్జీలను పెంచిందన్నారు.